
- 3శాతానికి పైగా లాభపడిన నిఫ్టీ
- రూ.13 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- మార్కెట్ బుల్లిష్ మోడ్‌లోకి వచ్చిందంటున్న ఎనలిస్టులు
- చంద్రబాబు నాయుడు కంపెనీ హెరిటేజ్ షేర్లు 20 శాతం అప్
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు మంగళవారం నష్టాల నుంచి కొంత రికవర్ అయ్యాయి. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ మిత్రపక్షాలు ముందుకు రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం దూసుకుపోయాయి. నిఫ్టీ 736 పాయింట్లు (3.36 శాతం) పెరిగి 22,620 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్ 2,303 పాయింట్లు ఎగసి 74,382 దగ్గర ముగిసింది. ఈ రెండు ఇండెక్స్‌లు మంగళవారం సెషన్‌లో 6 శాతం చొప్పున పడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద బుధవారం రూ.13 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.407.58 లక్షల కోట్లకు చేరుకుంది.
నిఫ్టీలో అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం షేర్లు ఎక్కువగా పెరగగా, ఎల్ అండ్ టీ, బీపీసీఎల్ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలకంగా మారడంతో ఆయన కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ బుధవారం 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. కంపెనీ షేర్లు రూ.547 దగ్గర ముగిశాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు బుధవారం లాభపడ్డాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 5 శాతానికి పైగా పెరగగా, నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు 4 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. మిగిలిన సెక్టార్ల ఇండెక్స్‌లు 3 శాతం వరకు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.9 శాతం లాభపడ్డాయి.
పుంజుకున్న అదానీ షేర్లు..
మార్కెట్‌లో లిస్ట్ అయిన 10 అదానీ కంపెనీల్లో తొమ్మిదింటి షేర్లు బుధవారం భారీగా పెరిగాయి. మంగళవారం వచ్చిన నష్టాల నుంచి కొంత మేర కోలుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ బుధవారం 11 శాతం పెరగగా, అదానీ పోర్ట్స్ 8 శాతం, అంబుజా సిమెంట్స్ 7 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 6 శాతం లాభపడ్డాయి. ఏసీసీ షేర్లు 5 శాతం పెరగగా, ఎన్‌డీటీవీ 3 శాతం లాభపడింది. కాగా, మంగళవారం సెషన్‌లో అదానీ కంపెనీల షేర్లు 25 శాతం వరకు పతనమయ్యాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
1. మార్కెట్ బుధవారం మధ్యాహ్నం సెషన్‌లో ఒక్కసారిగా పెరిగిందని, నిఫ్టీ 22,600 లెవెల్ పైన క్లోజయ్యిందని చాయిస్ బ్రోకింగ్ ఎనలిస్ట్ మందర్ భోజనే అన్నారు. నిఫ్టీ 22,800 పైన సెటిలైతే, 23 వేల వరకు ఈజీగా వెళుతుందని పేర్కొన్నారు. దిగువన 22,000, 21,800 కీలక సపోర్ట్‌లుగా పనిచేస్తాయని అంచనా వేశారు.
2. 100 రోజుల మూవింగ్ యావరేజ్ 21,786 దగ్గర నిఫ్టీకి సపోర్ట్ దొరికిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ దే అన్నారు. 22,500 పైన ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ కదిలితే మార్కెట్ పడినప్పుడు ఎంటర్ అయ్యే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని సలహా ఇచ్చారు. 22,400 సపోర్ట్‌గా, 22,800 రెసిస్టెన్స్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు.
3. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఇక వోలటాలిటీ దిగొస్తుందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. 23 వేల వరకు నిఫ్టీ వెళ్లాలంటే 22,600 పైన సస్టయిన్ కావడం ముఖ్యమని చెప్పారు. 21,800–22,000 లెవెల్స్ సపోర్ట్‌గా పనిచేస్తాయని అన్నారు. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చారు.
ఎన్‌ఎస్‌ఈ వరల్డ్ రికార్డ్..
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) బుధవారం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక ట్రేడింగ్ సెషన్‌లో అత్యధిక ఆర్డర్లను ప్రాసెస్ చేసి కొత్త వరల్డ్ రికార్డ్ ను సెట్ చేసింది. ఎన్‌ఎస్‌ఈ బుధవారం ఏకంగా 1,971 కోట్ల ఆర్డర్లను, 28.55 కోట్ల ట్రేడ్లను ప్రాసెస్ చేసింది.