
- 2 శాతం నుంచి 5 శాతం గ్యాప్ అప్‌తో నిఫ్టీ ఓపెన్ అవుతుందని అంచనా
- ఎన్‌డీఏకి మెజార్టీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడమే కారణం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి మెజార్టీ సీట్లు రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండడంతో ఈ వారం నిఫ్టీ కొత్త గరిష్టాలకు చేరుకుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీనికి తోడు టెక్నికల్‌గా చూసినా ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉందని పేర్కొన్నారు. మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాలపై మార్కెట్ ఫోకస్ పెట్టిందని అన్నారు. షార్ట్ కవరింగ్, ఫ్రెష్ బయ్యింగ్‌తో నిఫ్టీ 23 వేల లెవెల్‌ను తిరిగి అందుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ సుబాష్ గంగాధరన్ అన్నారు.
23,150–23,200 రేంజ్‌ను దాటితే 23,500 వరకు కదలొచ్చని అంచనా వేశారు. దిగువన 22,300 దగ్గర సపోర్ట్ దొరుకుతుందని అన్నారు. హయ్యర్ లెవెల్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం 22,531 దగ్గర సెటిలయ్యింది. 20 రోజుల మూవింగ్ యావరేజ్ 20,477 లెవెల్ దగ్గర నిఫ్టీకి శుక్రవారం సపోర్ట్ లభించిందని ఏంజెల్ వన్ ఈక్విటీ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ జిగార్ ఎస్ పటేల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌కు తగ్గట్టు ఎన్నికల ఫలితాలు ఉంటే నిఫ్టీ సరికొత్త గరిష్టాలను టచ్ చేయొచ్చని, 23,200–23,400 లెవెల్‌కు పెరగొచ్చని అంచనా వేశారు. ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ రావొచ్చని చెప్పారు.
మార్కెట్‌ను నడిపే మరిన్ని అంశాలు..
ఎన్నికల ఫలితాలతో పాటు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనుంది. జూన్ 7న ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. మనదేశ జీడీపీ 2023–24 లో అంచనాలను మించి 8.2 శాతం గ్రోత్ నమోదు చేయడంతో మార్కెట్ ర్యాలీ చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ పీఎంఐ డేటా ఈ వారం విడుదల కానుంది. గ్లోబల్‌గా చూస్తే చైనా, యూఎస్ ఎకనామిక్ డేటా మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. విదేశీ ఇన్వెస్టర్ల కదలికలను, డాలర్–రూపాయి ట్రెండ్‌ను జాగ్రత్తగా ఫాలో అవ్వాలని, బ్రెంట్ క్రూడాయిల్‌పై ఓ లుక్కేయాలని ఎనలిస్టుల సలహా ఇస్తున్నారు.
ఐదేళ్లలో 50 వేలకు నిఫ్టీ..
నిఫ్టీ వచ్చే ఐదేళ్లలో 50 వేల లెవెల్‌కు చేరుకుంటుందని వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్‌మెట్ ఫౌండర్ ప్రశాంత్ ఖేమ్కా అంచనా వేశారు. ప్రస్తుత స్థాయి 22,500తో పోలిస్తే ఇది రెండింతలు కంటే ఎక్కువ. ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి వస్తే విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియాకు రావడంపై ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాలని ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది సోమవారం సెషన్‌లోనే మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వడాన్ని చూడొచ్చు’ అని ప్రశాంత్ ఖేమ్కా వివరించారు. మార్కెట్ సోమవారం 2 శాతం నుంచి 5 శాతం లాభంతో ఓపెన్ అవుతుందని, సెషన్‌లో మరింత పెరుగుతుందని అంచనా వేశారు.