- 4.5 శాతం పడిన నిఫ్టీ
- శుక్రవారం మరో 1,200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు
- వేచి చూసే ధోరణిలో ఇన్వెస్టర్లు
ముంబై: మార్కెట్ పతనం శుక్రవారం కూడా కొనసాగింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను అనుకున్నంత తగ్గించదనే సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు గత ఐదు సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి వాల్యూ పడడం, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరగడంతో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ నాలుగన్నర శాతం చొప్పున పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.18.43 లక్షల కోట్లు నష్టపోయారు. ఒక వారంలో ఇంతలా నష్టపోవడం గత రెండేళ్లలో ఇదే మొదటిసారి.
సెన్సెక్స్ శుక్రవారం 1.5 శాతం శాతం అంటే 1,176 పాయింట్లు నష్టపోయి 78,041 వద్ద ముగిసింది. నిఫ్టీ 364 పాయింట్లు తగ్గి 23,588 దగ్గర సెటిలయ్యింది. సెషన్ ప్రారంభంలో ఇండెక్స్‌లు కోలుకున్నా, ఎక్కువ సేపు హయ్యర్ లెవెల్స్‌లో కొనసాగలేదు. యాక్సెంచర్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండడంతో ఐటీ షేర్లు మార్కెట్‌కు స్టార్టింగ్‌లో మద్ధతుగా నిలిచాయి. చివరికి మిగిలిన షేర్ల మాదిరే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఐటీ, ప్రభుత్వ బ్యాంక్, రియల్టీ షేర్లు ఇండెక్స్‌లను కిందకి లాగాయి. నిఫ్టీలో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ట్రెంట్ షేర్లు ఎక్కువగా నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మొత్తం 2,893 షేర్లు ఎన్‌ఎస్‌ఈలో ట్రేడవ్వగా, ఇందులో 2,270 షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. 555 షేర్లు లాభపడ్డాయి. గురువారం సెషన్‌లో నికరంగా రూ.4,500 కోట్ల షేర్లను అమ్మిన ఎఫ్‌ఐఐలు, శుక్రవారం మరో రూ.3,598 కోట్ల విలువైన షేర్లు అమ్మారు.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
అంచనా వేసిన దానికంటే తక్కువగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్ భావిస్తోందని, దీంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఎక్కువ వాల్యుయేషన్‌లో ఉన్న ఇండియన్ మార్కెట్లపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వాల్యుయేషన్స్ గరిష్టాల్లో ఉన్నాయని, ఈ షేర్లే భారీగా పడుతున్నాయని నాయర్ పేర్కొన్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ శుక్రవారం 2.5 శాతం చొప్పున పతనమయ్యాయి.
ఈ వారంలో 3.5 శాతం చొప్పున పడ్డాయి. నిఫ్టీకి 200 డీఎంఏ లెవెల్ 23,834 రెసిస్టెంట్‌గా పనిచేస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ నందీష్ షా పేర్కొన్నారు. దిగువన 23,263 దగ్గర సపోర్ట్ కనిపిస్తోందని అన్నారు. యూఎస్ కొత్త ప్రభుత్వం , ఇండియా యూనియన్ బడ్జెట్, డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీల లాభాలు పెద్దగా పెరగవనే అంచనాలతో మార్కెట్ పడుతోందని క్యాపిటల్‌మైండ్ రీసెర్చ్ ఎనలిస్ట్ కృష్ణ అప్పాలా వివరించారు. ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారని చెప్పారు. ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేసే లార్జ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చారు.