- నైజీరియా స్కూల్ పిల్లల కిడ్నాపర్స్ డిమాండ్
అబుజా: నైజీరియాలోని చికున్ జిల్లా కురిగా గ్రామ స్కూల్ నుంచి ఈ నెల 7న 287మంది స్టూడెంట్లను ఎత్తుకెళ్లిన దుండగులు తాజాగా డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 5 కోట్లు(6,21,848 డాలర్లు) ఇవ్వకపోతే పిల్లలందర్నీ చంపేస్తామని బెదిరించారు. కిడ్నాపర్సే తనకు ఫోన్ చేసినట్లు కురిగా గ్రామానికి చెందిన అమీను జిబ్రిల్ అనే వ్యక్తి బుధవారం వెల్లడించారు.
‘‘ గుర్తుతెలియని నంబర్ నుంచి దుండగులు ఫోన్ చేశారు. రూ.5.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 రోజులలో ఆ డబ్బు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే.. అందరినీ చంపేస్తామని బెదిరించారు” అని తెలిపారు. ప్రభుత్వం తమ ముఠా సభ్యులను చంపినందుకే నష్టపరిహారంగా డబ్బు డిమాండ్ చేస్తున్నామని దుండగులు చెప్పినట్లు జిబ్రిల్ తెలియజేశారు. జిబ్రిల్ నంబర్‌ను దుండగులు కిడ్నాపైన పాఠశాల ప్రిన్సిపాల్ దగ్గర తీసుకొని ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు.