సొంత దేశానికి నైజీరియన్ డిపోర్ట్

సొంత దేశానికి నైజీరియన్ డిపోర్ట్
  • ఫేక్  డాక్యుమెంట్లతో సిటీలో మకాం
  • డ్రగ్స్‌ సప్లయ్ చేస్తూ దొరికిన నిందితుడు
  • ఎఫ్‌ఆర్‌ఆర్​వో సహకారంతో నైజీరియాకు తరలింపు

హైదరాబాద్‌, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు, మారుపేరుతో హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న నైజీరియన్‌ను సిటీ పోలీసులు సొంత దేశానికి డిపోర్ట్  చేశారు. ఈ నెల 7న ముంబైలోని ఛత్రపతి మహరాజ్‌  ఇంటర్నేషనల్‌  ఎయిర్‌‌ పోర్ట్‌  నుంచి  నైజీరియాకు తరలించారు. నైజీరియా దేశానికి చెందిన ఇకేజి ఇన్నొసెంట్‌  డుకా(53) టూరిస్ట్‌  వీసాపై 2009లో ఇండియాకు వచ్చాడు. అప్పుడు ముంబైలో నివాసం ఉండి కొంతకాలం స్క్రాప్‌  బిజినెస్‌  చేశాడు. గుజరాత్‌లో ఏడాది పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాడు. ఆ తరువాత తమిళనాడులోని తిరుప్పూర్‌‌కు మకాం  మార్చాడు.

అక్కడ నాలుగేండ్ల పాటు టీషర్టులు విక్రయించాడు. 2014లో తమిళనాడు నుంచి బెంగళూరు వెళ్లాడు. డ్రగ్స్  సహా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్  వచ్చి పంజాగుట్టలో  నివాసం ఉంటున్నాడు. యువకులకు డ్రగ్స్‌  సప్లయ్  చేస్తూ ఇక్కడ కూడా ఇల్లీగల్  పనులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో హైదరాబాద్  యాంటీ నార్కోటిక్స్‌  వింగ్‌  పోలీసులకు చిక్కాడు. పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఫోర్జరీ డాక్యుమెంట్స్‌, గడువు ముగిసిన వీసా, పాస్‌పోర్టుతో దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఫారెనర్స్  రీజనల్  రిజిస్ట్రేషన్  ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌‌ఆర్‌‌వో) అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఇమ్మిగ్రేషన్, ఎఫ్‌ఆర్‌‌ఆర్‌‌ఓ అధికారులు అతడిని డిటెన్షన్  సెంటర్‌‌కు తరలించారు. న్యూఢిల్లీలోని నైజీరియన్  హైకమిషన్‌  సహకారంతో అతడిని సొంత దేశానికి తరలించామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుదీంద్ర తెలిపారు.

రైటప్ః ఇకేజి ఇన్నొసెంట్‌ డుకా