
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత వారం పది రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణ కాశ్మీర్ గా పిలువబడే కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. జిల్లాలో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు.. ఏకంగా 6.6 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా నగరంలో రాత్రి వేళ్ళలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం... నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చాలా మంది రాత్రిపూట, తెల్లవారుజామున వెచ్చని దుస్తులను ఉపయోగించడం ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోతున్నాయి.