
బరువు పెరగడం.. గుండె సమస్యలు.. నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఈ మధ్య అందరిలో కనిపిస్తున్నాయి. వీటికోసం డైట్, వ్యాయామాలు అని చాలానే కష్టపడుతుంటారు అందరూ.. కానీ ఒక చిన్న అలవాటుతో వీటన్నింటి నుంచి బయటపడొచ్చు. అదే రాత్రి భోజనం... రాత్రి ఏడు గంటల లోపు భోజనం ముగించడం ద్వారా లైఫ్ లో చాలా హెల్దీ మార్పులు చోటు చేసుకుంటాయి.
పొద్దున నుంచి రాత్రి వరకు మనం తినే ఆహారాన్ని గమనిస్తే పొద్దున తినే క్వాంటిటీనే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సిటీలో అర్థరాత్రి తినడం కూడా చాలామందికి అలవాటు. అయితే రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, లైట్ ఫుడ్ తీసుకోవాలని అది కూడా ఏడు లోపే ముగించాలని డాక్టర్లు మరీమరీ చెప్తున్నారు. ఈ ఒక్క అలవాటు వల్ల చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. అంటున్నారు వాళ్లు.
టైం టేబుల్ మారితే..
రోజువారీ పనులకు గడియారం టైంని ఎలా ఫాలో అవుతామో శరీరం కూడా అంతే... శరీరం కూడా ఒక కనిపించని క్లాక్ ను ఫాలో అవుతూ ఉంటుంది. రోజూ తినే టైం... పడుకునే టైంను క్యాలిక్యులేట్ చేసుకుంటూ దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం.. ఇది మనం చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్న టైం టేబుల్.
మన శరీరం దీనికే అలవాటైంది కాబట్టి ఎప్పుడూ అదే టైం టేబుల్ ని ఫాలో అవ్వాలి. కానీ పెద్దయ్యే కొద్దీ లైఫ్ స్టైల్ లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి వేళకు ఫుడ్ తీసుకోవడం తగ్గింది. ఒక్కో రోజు ఒక్కో టైంలో తినడం అలవాటైంది. దీంతో శరీరానికి టైం టేబుల్ అర్థం కాక కన్ ఫ్యూజ్ అవుతుంది. బాడీ బ్యాలెన్స్ తప్పి ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలొస్తున్నాయి.
రాత్రిళ్లు లేట్ గా తినడం వల్ల శరీరం రాత్రి తిన్న టైం నుంచి టైం క్యాలిక్యులేట్ చేసుకుంటుంది.. దానికి తగ్గట్టుగా నిద్ర లేట్ పడుతుంది. పొద్దున్నే మెలకువ లేట్ గా వస్తుంది. దాంతో లంచ్ టైంకు సరిగా ఆకలేయదు. అలా లంచ్ టైం కూడా ముందుకు జరుగుతుంది. ఈ మార్పులన్నీ తెలియకుండానే శరీరంలో జరిగిపోతాయి. రాత్రి లేట్ గా తినడం అనే ఒక్క అలవాటు చాలా సమస్యలకు కారణం అవుతుంది.
మరికొన్ని
రాత్రి ఏడు గంటలలోపే తినేయడం వల్ల ముఖ్యంగా బరువు పెరగడం, గుండె సమస్యలు, నిద్ర పట్టకపోవడం. ఈ మూడు సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. ఉదయం నిద్ర లేచిన గంట రెండు గంటల్లోపు అంటే 8, 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్, రాత్రి ఏడు లోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలి.. ఈ సమయాల్లో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా అంతగా నష్టం ఉండదు. బరువు పెరగడం.. పొట్ట రావడం లాంటి సమస్యలు దరిచేరవు.
రాత్రిపూట శరీరం నిద్రావస్థలో వుంటుంది. కాబట్టి తక్కువ శక్తి అవసరం అవుతుంది. పడుకునే ముందు ఎక్కువగా తింటే అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కేలరీలు ఖర్చయ్యే అవకాశం తక్కువ కాబట్టి బరువు పెరగడానికి వీలుంటుంది. అలాగే సరైన టైంలో భోజనం చేయకపోతే అందుబాటులో ఉన్న ఏదో ఒక ఫుడ్ పైకి మనసు మళ్లుతుంది. ఏదో ఒకటి తినాలి అన్న కోరిక పెరుగుతుంది. దాంతో జంక్ ఫుడ్ తినడం, మోతాదుకు మించి తినడం లాంటివి చేస్తుంటారు. దానివల్ల బరువు, హైపర్ ఎసిడిటీ లాంటివి పెరుగుతాయి.
- పొట్ట వస్తుందేమో అన్న భయంతో చాలామంది సాయంత్రం నుంచి నీళ్లు తాగడం మానేస్తుంటారు. అలా చేయడం అంత మంచిది. కాదు. పగటిపూటతో సమానంగా రాత్రి వేళల్లో కూడా తగినంత నీటిని తాగాలి.
- చాలామంది రాత్రి భోజనాన్ని హెవీగా తీసుకుంటారు. నిజానికి రోజు మొత్తంలో చేసే భోజనంలో బ్రేక్ ఫాస్టే ముఖ్యమైంది. రాత్రి భోజనం లైట్ గా, తేలికగా జీర్ణయమ్యేలా ఉండాలి.
- తిండి సరైన సమయంలో తీసుకుంటే.. పోషకాహార లోపం రాదు. రక్తహీనత, అజీర్తి, గుండెలో మంట, కడుపులో నొప్పి, ఎముకలు, కండరాల సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చు.
- భోజనానికి.. భోజనానికి మధ్య కనీసం 4,5 గంటల వ్యవధి ఉండాలి. భోజనానికి భోజనానికి మధ్య పండ్లు, వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడంవల్ల శరీరానికి సరైన పోషణ అందుతుంది.
–వెలుగు, లైఫ్–