Committee Kurrollu Review: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ..రూర‌ల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు(CommitteeKurrollu). ఈ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాతో ఏకంగా ప‌ద‌కొండు మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్ల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తోంది నిహారిక. ఇవాళ ఆగస్ట్ 9న క‌మిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించిన క‌మిటీ కుర్రోళ్ల జాతర ఎలాంటి అనుభూతి కలిగించిందో రివ్యూలో తెలుసుకుందాం. 

క‌థేంటంటే:

వెస్ట్ గోదావరిలోని ఓ మారుమూల ప‌ల్లెటూరు పురుషోత్తంప‌ల్లి. ఈ ఊరిలో శివ (సందీప్ సరోజ్), సూర్య (యశ్వంత్ పెండ్యాల), సుబ్బు (త్రినాధ్ వర్మ), విలియం (ఈశ్వర్), పెద్దోడు (ప్రసాద్ బెహరా) సహా ఇంకో ఆరు మంది చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎలాంటి కష్టం వచ్చిన ఒకరికొకరు కలిసి పోరాడే స్నేహాలు వీరివి. ఈ ప‌ల్లెటూరులో ప్ర‌తి ప‌న్నెండేళ్ల‌కు ఓ సారి జాత‌ర జ‌ర‌గ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంటుంది. ఈ భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌లో భాగంగా చేసే బ‌లి చేట ఉత్స‌వానికి ఎంతో ప్రాశ‌స్త్యం ఉంది. అలా ఒకరోజు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండే స్నేహితులు ఊళ్లో జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా ఒక్కసారిగా అందరూ విడిపోతారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత జాతర కోసం అందరూ ఊరికి వస్తారు. ఇక ప‌న్నెండేళ్ల త‌ర్వాత మళ్లీ జాతర జరగనుండటంతో ఎలాంటి గొడవలు జరుగుతాయోనని జనాలు భయపడుతుంటారు. ఈ ప్రత్యేకమైన జాత‌ర‌లో బ‌లిచాట‌ను ఎత్తుకోవ‌డానికి ఆ ఊరి నుంచి ఎవ‌రూ ముందుకు రారు. మ‌రోవైపు కులాల గొడ‌వ‌ల‌ను వాడుకుంటూ ఊరికి చాలా ఏళ్లుగా స‌ర్పంచ్‌గా కొన‌సాగుతాడు పొలిశెట్టి బుజ్జి (సాయికుమార్‌).

అయితే ఈసారి జాత‌ర జ‌రిగిన సరిగ్గా ప‌దిరోజుల‌కు ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఆ ఊరి ప్ర‌స్తుత స‌ర్పంచ్ పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. మరి అప్పుడు తమ స్నేహితులందరూ కలిసి ఊరికి వచ్చాకా కలిసి శివని ఎన్నికల్లో గెలిపించుకున్నారా? లేదా మళ్ళీ కొట్లాడుకున్నారా?

స్వార్థ రాజ‌కీయాల కోసం ఊరివాళ్ల‌ను క‌ల‌వ‌కుండా చేయడానికి పొలిశెట్టి బుజ్జి పన్నిన ఆలోచనలు ఏంటీ? బ‌లిచాట‌ను ఎత్తుకునే విష‌యంలో శివ, అత‌డి స్నేహితులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎలాంటి గొడ‌వ‌లు జ‌రిగాయి? ఊరిలో రెండు వ‌ర్గాలుగా విడిపోయిన వారు ఎన్నిక‌లు కార‌ణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?..అనే తదితర విషయాలు తెలియాలంటే కమిటీ కుర్రోళ్ళను థియేటర్లో కలవాల్సిందే.  

ఎలా ఉందంటే:

ఈ సినిమా అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ‌. అంటే మన కథ. ప‌ల్లెటూళ్ల‌లో క‌ల్మ‌షం లేని మ‌నుషులు, వారి స్నేహాలు..అక్క‌డి రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న‌ది డైరెక్టర్ య‌దు వంశీ చాలా సహజ సిద్ధంగా చూపించారు. ఇలాంటి కథలు ప్రతిఒక్కరి జీవితంలో జరిగేవే. అందుకే కథ కోసం వెతికే పనుండదు. కమిటీ కుర్రోళ్ళు నుంచి మొదట రిలీజైన విజువల్స్, మొన్న రిలీజైన ట్రైలర్ వరకు పాజిటివ్ వైబ్ కనిపించింది. తాజాగా సినిమా చూసిన ప్రేక్షకుడికి కూడా అంతే పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ క‌మిటీ కుర్రోళ్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ సినిమాలా కాకుండా సహజ సిద్దమైన ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల ముందు తీసుకొచ్చి..ఆడియన్స్ కు ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను క‌లిగించాడు డైరెక్టర్.

ఈ సినిమా కథ, కథనం సాంకేతికత అభివృద్ధి చెందని సమయంలో పల్లెటూరిలో పిల్ల‌ల మ‌ధ్య స్నేహాలు ఎలా ఉండేవి..కుల‌మ‌తాలకు అతీతంగా ఎలా క‌లిసిమెల‌సి జీవించే వాళ్లు అన్న‌ది మ‌న‌సుల‌కు హ‌త్తుకునేలా దర్శకుడు యదు వంశీ. ఫస్టాఫ్ లో 90స్ కిడ్స్ సూపర్ గా కనెక్ట్ అవుతారు..నవ్వుకుంటారు కూడా. చిన్నప్పటి సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవల్. ఈ మధ్య కాలంలో అలాంటి జాతర సీక్వెన్స్ చూడలేదు..

ఈ రూర‌ల్ కామెడీ డ్రామాలో అంత‌ర్లీనంగా రిజ‌ర్వేష‌న్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా డైరెక్టర్ ట‌చ్ చేయ‌డం చాలా ఇంప్రెస్స్ గా ఉంది. ప్ర‌తిభ ఉండి చ‌దువుకు కొంద‌రు ఎలా దూరం అవుతున్నార‌నే అంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా  ఆవిష్క‌రించాడు. ఆ పాయింట్‌తోనే స్నేహితుల మ‌ధ్య దూరం పెర‌గ‌డం..ఊర్లో రాజకీయం ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ ను..డైరెక్టర్ రాసుకున్న తీరు ఆక‌ట్టుకుంటుంది. ఏదో యూత్ ఫుల్ సినిమా తీసాం అన్నట్టు కాకుండా..రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడుకోవడం బాగుంది. అలాగే శివ మిత్రుడు ఆత్రం మ‌ర‌ణం అంద‌ర్నీ క‌దిలిస్తుంది. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయింది.. కానీ బోర్ అయితే కొట్టదు. పొలిటికల్ లీడర్స్ పై సెటైర్స్ కూడా బానే వేశారు. క్లైమాక్స్ లో జనసేన భావజాలం కనిపిస్తుంది. ఓడిన గెలిచిన ప్రశ్నించడం ముఖ్యం అనేది కమిటీ కుర్రాళ్ళ ఉద్దేశం అనేది చూపించాడు.

ఎవ‌రెలా చేశారంటే: 

క‌మిటీ కుర్రాళ్లు సినిమాలో స్టార్స్ అంటూ ఎవ‌రూ లేరు. అంద‌రూ కొత్త‌వాళ్లే కావడం స్పెషల్ గా కనిపించింది. ప్రతిఒక్కరు చాలా బాగా నటించారు. వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, కంచర‌పాలెం కిషోర్ వంటి వారి న‌ట‌నానుభ‌వం తమ పాత్రలకు, రాసుకున్న కథకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు కనిపించే హీరోలు, కథ అయితే, కనబడని హీరో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్.సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, RR సినిమాకి ప్రాణం పోశాయి. ముఖ్యంగా జాతర పాటతో పాటు ఓ బాటసారి, ఆ రోజులు మళ్ళీ రావు.. ఈ రెండు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.కెమెరామెన్ మారాజు గోదావ‌రి అందాల‌ను చ‌క్క‌గా చూపించాడు.నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.దర్శకుడు తను రాసుకున్న కథను ఎక్కడా పక్కదారి పట్టకుండా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇటువంటి  రూర‌ల్ కామెడీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు నిహారికను మెచ్చుకోవాల్సిందే.