నిఖేష్‌‌ కుమార్‌‌కు ముగిసిన కస్టడీ

నిఖేష్‌‌ కుమార్‌‌కు ముగిసిన కస్టడీ
  • చంచల్‌‌గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు
  • నాలుగు రోజుల విచారణలో ఆస్తులపై ఆరా
  • రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు!

హైదరాబాద్, వెలుగు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్​అయిన ఇరిగేషన్ మాజీ ఏఈఈ(అసిస్టెంట్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజనీర్‌‌) నిఖేష్‌‌ కుమార్ కస్టడీ ముగిసింది. అక్రమ ఆస్తులన్నీ బినామీల పేర్లతో ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. పనిమనుషులు, స్నేహితులు, దగ్గరి బంధువుల పేర్లతో బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించింది. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మే 30న ఏసీబీకి చిక్కిన నిఖేష్​ కుమార్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

దర్యాప్తులో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజులపాటు కస్టడీ తీసుకుని విచారించారు. ముగియడంతో ఆదివారం చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణలో హైదరాబాద్‌‌లోని పలు బ్యాంకులతోపాటు జహీరాబాద్‌‌లోని ఓ బ్యాంక్‌‌ లాకర్‌‌లో నిఖేశ్‌‌కుమార్‌‌ తన బినామీ ఆస్తుల పత్రాలు దాచి ఉంచినట్టు ఏసీబీ వివరాలు సేకరించింది. శనివారం, ఆదివారం మరింత లోతుగా నిఖేష్​కుమార్‌‌ను విచారించినట్లు తెలిసింది. ఇటీవల ఆయన ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 19 చోట్ల సోదాలు నిర్వహించారు.

10 ఏళ్లలో రూ.200 కోట్లకు.. 

2013లో ఇరిగేషన్​ డిపార్టుమెంట్‌‌లో ఏఈఈగా చేరిన నిఖేష్‌‌ కుమార్‌‌.. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు.  భారీ భవనాలు, రియల్‌‌ ఎస్టేట్‌‌ వెంచర్లకు ఇరిగేషన్‌‌ శాఖ ఇచ్చే ఎన్‌‌ఓసీ తప్పనిసరి కావడంతో అడ్డగోలుగా అక్రమార్జనకు అలవాటుపడినట్లు తెలుస్తోంది. ఉద్యోగంలో  చేరిన పదేళ్లలో రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్థారించినట్లు సమాచారం. మణికొండకు చెందిన ఓ బిల్డర్‌‌ కు ఎన్‌‌ఓసీ ఇచ్చేందుకు ఈఈ, ఏఈ, ఏఈఈ నిఖేష్​కుమార్​రూ. 2.50లక్షలు లంచం డిమాండ్‌‌ చేశారు. 

అందులో రూ. 1.50లక్షలు అడ్వాన్స్‌‌గా తీసుకున్నారు. వారితో పాటు తహసీల్దార్​కార్యాయం సర్వేయర్‌‌ రూ. 40 వేలు లంచం తీసుకున్నాడు. అదీ చాలదన్నట్లు మరింత ఎక్కువ లంచం డిమాండ్‌‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పైన పేర్కొన్న ఇరిగేషన్‌‌ అధికారులు బృందం రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ముగ్గురు ఇరిగేషన్‌‌ అధికారులను, సర్వేయర్‌‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.