- స్థలం ఇస్తే హైదరాబాద్‌లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తా
హైదరాబాద్, వెలుగు: పారిస్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గలేకపోవడం తనను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని ఇండియా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ చెప్పింది. ఒలింపిక్ మెడల్ నెగ్గి తన కల నెరవేర్చుకోవడం కోసం ఎంతగానో కష్టపడ్డానని తెలిపింది. కానీ పారిస్ గేమ్స్‌లో తనకు సీడింగ్ లభించకపోవడం, ప్రతికూల డ్రాలో ఆడటం తీవ్ర ప్రభావం చూపిందంది.
పతకం లేకుండా వెనుదిరగడం చాలా బాధించినా దీన్ని మరిచిపోయి బలంగా తిరిగొస్తానని వచ్చే కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌పై దృష్టి పెడతానని గురువారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది. తనను డీఎస్పీగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నిఖత్ కృతజ్ఞతలు తెలిపింది.
‘ప్రభుత్వం నాకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఆఫర్ చేసినా చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని అనుకున్నా. కాబట్టి డీఎస్పీ పోస్టునే అడిగా. ఈ ఉద్యోగం నాపై బాధ్యతను మరింత పెంచింది. అందరితో పాటు ట్రైనింగ్ కూడా తీసుకుంటా. ఉద్యోగం, వ్యక్తిగత పనులు, హైదరాబాద్‌లో నా కొత్త ఇంటి నిర్మాణం చూసుకోవాల్సిన నేపథ్యంలో నాకు పర్సనల్ కోచ్‌ను కేటాయిస్తే ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటా.
ఇండియన్ కోచ్‌ను ఇవ్వాలని ఫెడరేషన్‌ను కోరాను. హైదరాబాద్‌లో సరైన ఇండోర్ బాక్సింగ్ అకాడమీ, సదుపాయాలు లేవు. కాబట్టి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ మాదిరిగా సిటీలో అత్యుత్తమ బాక్సింగ్ అకాడమీని నేనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇందుకోసం ల్యాండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాను. ఈ అకాడమీలో నాలాంటి బాక్సర్లు, ఎంతో మంది యంగ్‌స్టర్స్ కోచింగ్ తీసుకోవచ్చు’ అని నిఖత్ పేర్కొంది.