- అభ్యర్థిత్వ రేసులో మొదటి సారి గెలుపు
- ట్రంప్ విజయ పరంపరకు బ్రేక్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీచేస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మొదటిసారి విజయం సాధించారు. అంతకుముందు తన సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో ఓటమిపాలైన హేలీ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వాషింగ్టన్ డీసీలో గెలిచారు. అమెరికా చరిత్రలోనే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం నిర్వహిస్తున్న ఎన్నికల్లో విజయం సాధించిన తొలి మహిళగా హేలీ చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఓటమి లేకుండా దూసుకుపోతున్న ట్రంప్ కు ఆమె అడ్డుకట్ట వేశారు. హేలీకి 62.9 శాతం ఓట్లు రాగా, ట్రంప్ కు 33.2 శాతం ఓట్లు వచ్చాయి. డెమోక్రాట్ల ఆధిపత్యం ఉన్న వాషింగ్టన్ డీసీలో హేలీ గెలుపొందడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 2035 మంది రిపబ్లికన్లు పాల్గొన్నారని పార్టీ అధికారులు తెలిపారు. కాగా, సొంత రాష్ట్రం సౌత్ కరోలినా ప్రైమరీలో ఓడిపోయినా రేసు నుంచి తప్పుకోవడానికి హేలీ నిరాకరించారు. అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో ట్రంప్ కు ఆధిక్యం ఉన్నా ఆయనకు ప్రత్యామ్నాయం తానే అని ఆమె పేర్కొంటున్నారు. మరోవైపు హేలీ కన్నా ట్రంప్ కే ఆధిక్యం ఉంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రెసిడెంట్ జో బైడెన్ పై ట్రంప్ పోటీచేయడం దాదాపుగా ఖాయమైపోయింది. హేలీకి ఇప్పటి వరకు 43 మంది ప్రతినిధుల మద్దతు ఉండగా.. ట్రంప్ కు 247 మంది డెలిగేట్లు మద్దతు ఇచ్చారు.