- అధిక వడ్డీల పేరిట రూ.200 కోట్లు కొట్టేసిన్రు
- తెలంగాణ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిర్వాకం
- తన భర్త కంపెనీలో కస్టమర్లు, బ్యాంక్ సిబ్బంది చేత ఇన్వెస్ట్ మెంట్
- కంపెనీ బోర్డు తిప్పేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు
అధిక వడ్డీ ఆశచూపి ఓ కంపెనీ సుమారు 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసింది. కోట్లలో డబ్బులు దండుకున్న యాజమాన్యం హఠాత్తుగా బోర్డు తిప్పేసింది. దాంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్, అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంకులో నిమ్మగడ్డ వాణిబాల జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నది. ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు శ్రీహర్ష అబిడ్స్ లో శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరిట కంపెనీ నడుపుతున్నారు.
అందులో పెట్టుబడి పెట్టాలని వాణిబాల తన బ్యాంక్ సిబ్బందిని, పలువురు ఖాతాదారులను కోరింది. తన భర్త, కొడుకు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారని.. అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని నమ్మబలికింది. వాణిబాల బ్యాంక్ జనరల్ మేనేజర్ కావడంతో ఆమె మాటలను నమ్మిన పలువురు పెద్ద మొత్తంలో ప్రియాంక ఎంటర్ ప్రైజెస్‌లో ఇన్వెస్ట్ చేశారు. మొదట్లో వారికి ప్రతి నెలా 15 శాతం వడ్డీని కంపెనీ చెల్లించింది.
దాంతో మొదట పెట్టుబడి పెట్టినవారు తమకు తెలిసిన మరికొంత మందితో కూడా ఇన్వెస్ట్ చేయించారు. ఈ ఏడాది జనవరి వరకు కంపెనీ కరెక్టుగా వడ్డీలను చెల్లించింది. జనవరి తరువాత తమకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, 2 నెలలు గడువిస్తే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి ఇస్తామని కంపెనీ ఓనర్ నేతాజీ నమ్మబలికాడు. సమయం గడుస్తున్నా వారి నుంచి సమాచారం రాకపోవడంతో పెట్టుబడిదారులంతా మోసపోయామని గ్రహించారు.
వెంటనే కంపెనీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ తాళాలు వేసి ఉండడంతో వారికి ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇన్వెస్ట్ చేయించిన వాణిబాల కూడా సెలవులో ఉందని, ఆమె తిరిగి వస్తుందో లేదో కూడా తెలియదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. అంతేగాక..ఈ నెలలో ఆమె రిటైర్మెంట్ ఉందని తెలిసింది. దాంతో బాధితులంతా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులంతా వేడుకున్నారు.