గుండె దడకు ఆర్ఎఫ్​సీఏతో చెక్..సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు

గుండె దడకు ఆర్ఎఫ్​సీఏతో చెక్..సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు
  • నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ఓరుగంటి సతీశ్ 
  • ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా చికిత్సలు చేసినట్టు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి గుండె దడ సమస్య వస్తోందని, రేడియో ఫ్రీక్వెన్సీ క్యాథటర్ అబ్లేషన్(ఆర్ఎఫ్​సీఏ) చికిత్స ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా నివారించొచ్చని నిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. ప్రైవేట్ దవాఖాన్లలో రూ. లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను నిమ్స్ లో తక్కువ ఖర్చుకే చేస్తున్నామని తెలిపారు. నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఓరుగంటి సాయి సతీశ్ ఈ మేరకు తన బృందంతో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

గుండెదడ సమస్య వయసుతో సంబంధం లేకుండా18 నుంచి 80 ఏండ్ల మధ్య అందరిలో వస్తోందన్నారు. గుండె దడ సమస్య తీవ్రతను బట్టి 2డీ, 3డీ అధునాత న మెషీన్ల ద్వారా సర్క్యూట్ లను గుర్తిస్తామని, రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ నేరుగా రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న టిష్యూని టార్గెట్ చేస్తుందన్నారు. అబ్ నార్మల్ టిష్యూను మాత్రమే రేడియో ఎనర్జీ తొలగిస్తుందన్నారు. ఈ చికిత్స గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుందని, మూడు రోజుల్లో పేషెంట్ ను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు వెయ్యికిపైనే ఆర్ఎఫ్ఏ చికిత్సలు చేశామని, గతేడాది ఎక్కువగా107 మందికి ట్రీట్మెంట్ జరిగిందన్నారు.

Also Read :- ఢిల్లీలో తొలగని మంచు దుప్పటి

తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ హాస్పిటల్ లోనూ ఈ చికిత్స అందుబాటులో లేదని, ఒక్క నిమ్స్ లోనే ఉందని వెల్లడించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని, నిమ్స్ లో తక్కువ ఖర్చుతోనే చికిత్స పూర్తవుతుందన్నారు. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, టీఎస్​ఆర్టీసీ ద్వారా కూడా చేయించుకోవచ్చన్నారు. 

సాధారణ సమస్యగా తీసుకోవద్దు..  

గుండె దడ సమస్యను సాధారణ సమస్యగా తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మెనోపాజ్, పీరియడ్స్, ప్రెగ్నెంట్ మహిళల్లో గుండె దడ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే జెండర్ తో సంబంధం లేకుండా షుగర్, బీపీ, ఊబకాయం, గురక సమస్యలు ఉన్నవాళ్లు రెగ్యులర్ గా హార్ట్ చెకప్​చేయించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. వంశ పారంపర్యంగా కూడా గుండె దడ సమస్య వస్తుందంటున్నారు. గుండె దడ సంభవించినప్పుడు రక్త ప్రసరణ తగ్గి రోగికి బీపీ, చాతీలో నొప్పి, భయం, ఆయాసం, కండ్లు తిరగడం, చెమటలు పట్టడం వంటివి కనిపిస్తాయని..

గుండె కొట్టుకోవడం 80లోపు ఉంటే ప్రమాదమేమి లేదని, 80 దాటి150 వరకు చేరితేనే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొందరికి గుండె స్పీడ్ 250 దాటుతుందని, అలాంటి వారు ఆర్ఏఎఫ్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె దడ సమస్యకు దీర్ఘకాలికంగా మందులు వాడితే కండరాలు దెబ్బతింటాయని, క్రమేణా హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.