- ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేసిన డాక్టర్లు
- అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ దవాఖానగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకూ 101 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప బుధవారం ప్రకటించారు. ఇందులో 55 కిడ్నీలను బాధిత పేషెంట్ల కుటుంబ సభ్యులు డొనేట్ చేయగా, ఇంకో 46 కిడ్నీలను బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించి పేషెంట్లకు అమర్చామని తెలిపారు. ఇవిగాకుండా 4 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు, ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా ఈ ఏడాది చేశామని వెల్లడించారు. ఈ సర్జరీలన్నీ ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేశామన్నారు.
పేషెంట్లకు అవసరమైన మెడిసిన్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సహకారంతో తాము ఈ ఘనత సాధించగలిగామని వివరించారు. అతి తక్కువ సమయంలో వందకుపైగా ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసి, పేదలకు వైద్య సేవలు అందించడంలో నిమ్స్ మరోసారి తన కమిట్‌మెంట్‌ను చాటుకుందని పేర్కొన్నారు. నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.