
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాల గురజాలలో కొందరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలతో వైద్యాధికారులు స్పందించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్య బృందంతో శనివారం గ్రామంలో పర్యటించారు.
డీఎంహెచ్‌వో హరీశ్ రాజ్, జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్, నెఫ్రాలజీ నిపుణుడు చరణ్ రాజ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ చందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరంజన్ గణేశ్ తదితరులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించారు. 153 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామస్తుల ఆహార అలవాట్లు, తాగు నీటి వివరాలు తదితర అంశాలను సేకరించారు.
భయపడాల్సిన అవసరం లేదు
గ్రామంలో కిడ్నీ సమస్య తీవ్రత అంతగా లేదని, భయపడాల్సిన అవసరం లేదని ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్ అన్నారు. సమస్యలున్న వారి రక్త నమూనాలను టీ-హబ్‌కు పంపించామని, తాగు నీటి నమూనాలను వరంగల్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులు ఇచ్చామని, పాటించాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు తెలిపారు. రిపోర్టుల ఆధారంగా పరిస్థితి తీవ్రత గల వారిని నిమ్స్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తామ న్నారు. ఇకపై వారానికోసారి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.