నిమ్స్​లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి.. 33 ఏండ్ల యువకుడికి విజయవంతంగా సర్జరీ

నిమ్స్​లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి..  33 ఏండ్ల యువకుడికి విజయవంతంగా సర్జరీ
  • దక్షిణాదిన సర్కారు దవాఖానలో ఇదే తొలిసారి 
  • ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా ట్రాన్స్​ ప్లాంటేషన్ 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖాన మరో అరుదైన ఘనత సాధించింది. దక్షిణాదిలోనే తొలిసారిగా రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేసిన తొలి సర్కార్ దవాఖానగా నిలిచింది. నిమ్స్ లో తొలి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌‌‌‌‌‌ప్లాంటేషన్ ఆపరేషన్ ను విజయవంతంగా చేసినట్లు హాస్పిటల్ యూరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ బృందం డాక్టర్లు మంగళవారం ప్రకటించారు. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏండ్ల యువకుడు 2017లో కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాడు. కానీ అది సక్సెస్ కాకపోవడంతో తీవ్ర కిడ్నీ సంబంధిత సమస్యతో ఎండ్ స్టేజ్ లో ఉన్నాడు. 

అయితే, బ్రైన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని నిమ్స్ డాక్టర్లు రోబోటిక్ సర్జరీ ద్వారా అతడికి మార్పిడి చేశారు. గతంలో సర్జరీ జరిగినందున ఈ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారిందని, అయినా ఎలాంటి సమస్యలు లేకుండా సక్సెస్ ఫుల్​గా ఆపరేషన్ పూర్తి చేయగలిగామని డాక్టర్లు చెప్పారు. కొత్తగా అమర్చిన కిడ్నీ బాగా పని చేస్తోందని, పేషంట్ కోలుకుంటున్నాడని తెలిపారు. సౌత్ ఇండియాలోనే సర్కారు దవాఖానలో రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. 

ఈ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో సీనియర్ ప్రొఫెసర్ హెచ్​వోడీ డాక్టర్ రామ్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ నిర్వహించారు. సాధారణంగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్​కు నిమ్స్​లో గానీ, బయట హాస్పిటల్స్ లో గానీ రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఈ పేషెంట్​కు మాత్రం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేసినట్టు డాక్టర్లు తెలిపారు. అరుదైన ఆపరేషన్​ను విజయవంతంగా చేసిన డాక్టర్లను, సిబ్బందిని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అభినందించారు. 

నిమ్స్​లో 2 వేల కిడ్నీ మార్పిడి సర్జరీలు..  

ఈ ఏడాదిలో రెండున్నర నెలల కాలంలోనే నిమ్స్ యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ విభాగం డాక్టర్లు 41 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశారు. దీంతో ఇప్పటివరకు నిమ్స్ డాక్టర్లు చేసిన మొత్తం కిడ్నీ మార్పిడి సర్జరీల సంఖ్య 2 వేలకు చేరింది. అలాగే యూరాలజీ విభాగం పరిధిలో కిడ్నీ మార్పిడి కాకుండా, మొత్తం11వేల కిడ్నీ సంబంధిత ఆపరేషన్లు చేశామని డాక్టర్లు తెలిపారు.