నిమ్జ్‌‌‌‌‌‌‌‌కు 100 ఎకరాలే అడ్డు  

నిమ్జ్‌‌‌‌‌‌‌‌కు 100 ఎకరాలే అడ్డు  
  • సంగారెడ్డి జిల్లాలో ఇన్‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌ఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు నిర్ణయం
  • భూ సేకరణకు అడ్డంకిగా మారిన రెండు గ్రామాల ప్రజలు
  • తమ భూములను వదిలేయాలంటున్న చీలపల్లితండా వాసులు
  • పరిహారం ఇస్తేనే భూములిస్తామంటున్న ఎల్గోయి గ్రామస్తులు

సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో నిర్మించతలపెట్టిన నిమ్జ్‌‌‌‌‌‌‌‌ (నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌ఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌) భూసేకరణ అంశం కొలిక్కి రావడం లేదు. జిల్లాలో నిమ్జ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆఫీసర్లు ఇందుకు నాల్కల్‌‌‌‌‌‌‌‌, ఝరాసంగం మండలాల పరిధిలో మొత్తం 12,500 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో 7,350 ఎకరాలను ఇప్పటికే సేకరించగా మిగతా భూ సేకరణ కోసం స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఝరాసంగం మండలంలోని ఎల్గోయి, చీలపల్లి తండాలో 100.5 ఎకరాల భూ సేకరణే ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది.

దివంగత ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ 2006లో పేదలకు పట్టాలు ఇచ్చిన భూముల్లోనే ఈ 100 ఎకరాలు ఉన్నాయి. దీంతో ఆ భూములను ఇచ్చేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఒప్పుకోవడం లేదు. భూములు తీసుకుంటే పరిహారం ఇవ్వాలని ఎల్గోయి గ్రామస్తులు కోరుతుండగా, పరిహారం వద్దు.. ఇతర అవసరాలకు ఆ భూములను వాడుకుంటామని చీలపల్లి తండావాసులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఆఫీసర్లు భూసేకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.

రెండు గ్రామాల్లోనే సమస్య

చీలపల్లి తండాలో సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 120లో 8 ఎకరాలు, సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 117లో 14.17 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఈ భూములను పేదల నివాసం కోసం వదిలేసి నిమ్జ్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదిత ప్రాంతం నుంచి మినహాయించాలని తండావాసులు కోరుతున్నారు. తండాలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ వ్యవసాయమే ప్రధానంగా బతుకుతున్నామని, తమ భూములను వదిలేసి, పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఎల్గోయి గ్రామ సర్వేనంబర్‌‌‌‌‌‌‌‌ 125లో 382.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 282 ఎకరాలను సేకరించారు.

మిగిలిన 100.5 ఎకరాల్లో 45 ఎకరాల భూమిని ఆలయాలు, డంప్‌‌‌‌‌‌‌‌యార్డ్‌‌‌‌‌‌‌‌, స్కూళ్లు, శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతివనం, సబ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌, ఇండ్ల స్థలాల కోసం తీసుకున్నారు. మిగతా 55 ఎకరాల్లో 23 మందికి పట్టాదార్ పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. కానీ పరిహారం అందలేదు. అయితే మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్న కొందరు ప్రస్తుతం పొజిషన్‌‌‌‌‌‌‌‌లో లేరు. ఆయా భూములను రీసర్వే చేసి పొజిషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నది ఎంత మంది, లేనిది ఎంత మందో ? తేలిస్తేనే ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆఫీసర్లకు చుక్కెదురు

భూ సేకరణ విషయంపై చీలపల్లి తండా, ఎల్గోయి గ్రామస్తులతో చర్చించేందుకు ఇటీవల వెళ్లిన ఆఫీసర్లకు చుక్కెదురైంది. కలెక్టర్ క్రాంతి ఆదేశాలతో ట్రైనీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మనోజ్, టీజీఐఐసీ జీఎం రతన్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఆర్డీవో రాంరెడ్డి ఈ నెల 5న ఆ రెండు గ్రామాలను సందర్శించారు. బాధితులతో వేర్వేరుగా చర్చించగా పరిహారం ఇచ్చేదాకా భూములు ఇచ్చేది లేదని ఎల్గోయి గ్రామస్తులు, ఆ భూములు గ్రామ అవసరాలకు వదిలేయాలని చీలపల్లి వాసులు స్పష్టం చేశారు. దీంతో సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పిన ఆఫీసర్లు ఆయా గ్రామాల నుంచి వెనుదిరిగారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం 

కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు చీలపల్లి తండా, ఎల్గోయి గ్రామాలను ఇటీవల సందర్శించాం. భూ కేటాయింపులతో పాటు ఇతరత్రా విషయాలపై గ్రామస్తులతో చర్చించాం. వారి విన్నపాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వానికి రిపోర్టులు పంపిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. అందరికీ న్యాయసమ్మతంగా నిర్ణయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – రాజు, నిమ్జ్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్