ఇప్పపువ్వు లడ్డూలపై ఎన్ఐఎన్ రీసెర్చ్.. ఎక్కువ రోజులు ఉండేలా పరిశోధనలు

ఇప్పపువ్వు లడ్డూలపై  ఎన్ఐఎన్ రీసెర్చ్.. ఎక్కువ రోజులు ఉండేలా పరిశోధనలు
  • 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటున్న లడ్డూ.. 
  • లడ్డూలు తయారు చేస్తున్న ఉట్నూరు మహిళలు
  • జీసీసీ పరిధిలోకి తీసుకొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే యోచన
  • గత నెల మన్ కీ బాత్​లో ఈ లడ్డూలను ప్రస్తావించిన ప్రధాని మోదీ

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూలను ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా, హైదరాబాద్ లోను విక్రయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ప్రస్తుతం ఈ లడ్డూలు వారం నుంచి 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలంటే నెలల పాటు లడ్డు పాడవకుండా ఉండేలా ఎలా మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధనలు జరగుతున్నాయి. 

ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు బాధ్యతలు అప్పగించింది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే లడ్డు తయారీలో తేనే కలపాలని అక్కడి నిపుణులు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఇటీవల తెలిపారు. తేనే తో పాటు మరి కొన్ని పదార్థాలను సైతం కలిపితే ఇంకా ఎక్కువ కాలం లడ్డూ పాడవకుండా ఉండటానికి పరిశోధనలు చేస్తున్నారు. ఈ పక్రియ చివరి దశకు చేరుకుందని, త్వరలో ఎన్ఐఎన్ ఈ అంశంపై రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందచేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

 ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్నరు

ఇప్పపువ్వు లడ్డుకు ఆదివాసీ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్నారు. ఈ పుష్పాలు మార్చి, -ఏప్రిల్​లో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో సమృద్ధిగా లభిస్తాయి. గోండి భాషలో ఈ లడ్డూలను ఈరుక్ లడ్డు, కొలామీ భాషలో పొక్కే లడ్డు అని పిలుస్తారు. 2015లో ఉట్నూరు ఐటీడీఏ సహకారంతో, 12 మంది ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం ఏర్పాటు చేసి, ఆదివాసీ ఆహారం పేరుతో ఒక కుటీర పరిశ్రమను ప్రారంభించారు. ఈ యూనిట్ ఇప్పపువ్వు లడ్డూల తయారీ ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబనను అందిస్తోంది.

సరికొత్త ప్రయోగమన్న ప్రధాని మోదీ

ఇప్పపూల లడ్డుల గురించి గత నెలలో ప్రసారం అయిన మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మండలంలోని ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూలపై ప్రశంసలు కురిపించారు. ఈ లడ్డూలను భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్నారని, ఈ లడ్డూలు ఆదివాసీ ఆహారం బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్టు చెప్పారు. ఇప్పపువ్వు లడ్డూలను సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. 

ప్రధాని మోదీ మన్ కి బాత్ లో ఈ లడ్డుల గురించి ప్రస్తావించటంతో  ఇప్పపువ్వు లడ్డూలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  ఈ లడ్డూలలో ఆదివాసీ సంస్కృతి మరియు సహజమైన తీపిదనం దాగి ఉందని ప్రధాని కొనియాడారు. అదిలాబాద్ ఆదివాసీ మహిళలు ఇప్ప పుష్పాలను ఉపయోగించి తమ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా ప్రదర్శించారు, వారి ఉత్పత్తులు ప్రజలలో త్వరగా జనాదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లడ్డూల ద్వారా ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిని సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. 

ఇప్పపువ్వు లడ్డూలో పోషకాలెన్నో

ఇప్పపువ్వు లడ్డూలో ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుందని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ లడ్డూలను ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు, అంగన్‌‌వాడీ కేంద్రాలలో విద్యార్థులకు, గర్భిణీలకు అందజేసే ప్లాన్ అధికారులు చేస్తున్నారు. రక్తహీనతతో బాధపడే వారికి, ఎముకలను బలంగా చేయటం, రోగ నిరోధక శక్తి పెంచటం, కీళ్ల నొప్పులు తగ్గించటం, గర్భిణీలకు, చర్మ సమస్యలను తగ్గించటం వంటి సమస్యలకు ఈ లడ్డులు ఎంతో పరిష్కారం అని ఎన్ఐఎన్ నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పోషణ మిత్రలో భాగంగా ప్రతి బుధ, శుక్రవారాల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థినులకు రెండు లడ్డూలను ఉచితంగా అందజేస్తున్నారు. 

అయితే ఆదివాసీ మహిళల నుంచి ఈ లడ్డుల తయారీని జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్) తీసుకోనుందని, ఎన్ఐఎన్ నుంచి తుది నివేదిక రాగానే ఈ ప్రాసెస్ పూర్తి అవుతుందని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఈ లడ్డూలు స్థానికంగా కిలోకు రూ.400  (ఒక్కో లడ్డూ 20 గ్రాములు) ధరతో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల ఉట్నూరు మహిళలు ఈ లడ్డూలను అమ్మటం ద్వారా రూ.8 లక్షల సంపాదిస్తున్నారు. ఖర్చులు పోనూ ప్రతి నెల మహిళ సంఘంలో ఉన్న ప్రతి మహిళ రూ.20 వేలు సంపాదిస్తున్నారు.