మెనోపాజ్ సమస్యలకు ఆయుర్వేద మందు

మెనోపాజ్ సమస్యలకు ఆయుర్వేద మందు
  • ఔషధ గడ్డి మొక్క నుంచి తయారు చేసిన ఎన్ఐఎన్​ సైంటిస్టులు
  • ఆధునికతను జోడించి ల్యాబ్​లో పరిశోధనలు
  • రెగ్యులేటరీ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి రీసెర్చ్
  • హైదరాబాద్​లో తయారైన ఔషధానికి దక్కిన పేటెంట్

హైదరాబాద్, వెలుగు: మెనోపాజ్​దశలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎముకలు బలహీనంగా మారడం, ఫ్యాటీ లివర్​లాంటి తీవ్రమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలకు అల్లోపతిలో మందులు ఉన్నప్పటికీ సైడ్​ఎఫెక్ట్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే హైదరాబాద్​లోని నేషనల్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సైంటిస్ట్​ డాక్టర్ ​వందనా సింగ్.. మెనోపాజ్​ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఆయుర్వేద మందును తయారు చేశారు.

బనారస్​కు చెందిన ఆమె కొంతకాలంగా వేదాల్లోని సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై స్టడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయంగా లభించే ఔషధ గుణాలు కలిగిన ఓ గడ్డి మొక్క ద్వారా ఈ ఔషధాన్ని తయారు చేసినట్టు ప్రకటించారు. సీనియర్​ సైంటిస్ట్, ఎన్ఐఎన్ ​డ్రగ్​ డివిజన్ హెడ్ ​దినేశ్​ కుమార్​  సహకారంతో దీనిపై పరిశోధన చేసిన ఆమె.. ఈ ఔషధానికి పేటెంట్​ను కూడా సాధించారు.   

లైఫ్ స్టైల్ మార్పులతో సమస్యలు.. 

వాస్తవానికి మెనోపాజ్ ద్వారా వచ్చే సమస్యలకు ప్రస్తుతం హార్మోనల్ రీప్లేస్​మెంట్​ థెరపీ (హెచ్ఆర్టీ) ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే దాని వల్ల రక్తం ఎక్కువగా పోవడం, కాలేయ సమస్యలు తలెత్తడం, రొమ్ము కేన్సర్ ​ప్రమాదాలు వస్తుండడం, గుండె జబ్బుల ముప్పు పొంచి ఉండడంతో.. ఎక్కువ కాలం పాటు హెచ్ఆర్టీ ట్రీట్​మెంట్​తీసుకోకుండా ఇప్పటికే యూఎస్ఎఫ్​డీఏ దానిపై పలు ఆంక్షలు విధించింది. మరోవైపు మారుతున్న లైఫ్​స్టైల్, ఆహారపు అలవాట్లతో మెనోపాజ్ సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నదని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది మహిళలు మెనోపాజ్ ​ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయంగా హెర్బల్ ​ఆల్టర్నేటివ్ థెరపీ(హాల్ట్)పై డాక్టర్​ వందనా సింగ్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఎన్నెన్నో మూలికలపై స్టడీ చేశారు. ఔషధ గుణాలు కలిగిన ఓ గడ్డి మొక్కలో ఎలాంటి దుష్ప్రభావాలు చూపించని కాంపొనెంట్​ను గుర్తించి ఔషధాన్ని తయారు చేశారు.  

ఆయుర్వేదానికి ఆధునికతను జోడించి..

ఆయుర్వేదం అనగానే ఏదో చెట్ల పసరు తీసో లేదంటే మూలికను ఇచ్చో వైద్యం చేయడమని చాలా మంది అనుకుంటారు. అయితే, వందనా సింగ్​ మాత్రం ఆ ఆయుర్వేదానికి కాస్తంత ఆధునికతను జోడించారు. తాను గుర్తించిన గడ్డి మొక్క నుంచి ఔషధ విలువలున్న కాంపొనెంట్లను సేకరించి ల్యాబ్​లో పరిశోధనలు చేశారు. క్లినికల్​ఎక్స్​పెరిమెంట్లు నిర్వహించారు. ‘‘ఔషధ మొక్కను శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించాం. అందరికీ నమ్మకం కలిగేలా మోడర్న్​ మెడిసిన్​లో  చేసే ప్రయోగాలన్నీ చేశాం. మైక్రోస్కోపిక్​ ఎవాల్యుయేషన్​ నిర్వహించాం. నాణ్యతా ప్రమాణాలు, రెగ్యులేటరీ నిబంధనలను పాటిస్తూ ఫార్మ్యులేషన్​(మందు)ను రూపొందించాం. ప్రూఫ్​ ఆఫ్​ కాన్సెప్ట్​ను సిద్ధం చేసుకున్నాం’’ అని డాక్టర్​ వందనాసింగ్​‘వెలుగు’కు తెలిపారు. 

మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొనే మహిళలకు నాన్ ​హార్మోనల్​ థెరపీ ద్వారా ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​లేని ఔషధాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయుర్వేదంపై రీసెర్చ్​ చేశామని ఆమె వివరించారు. కాగా, గత నాలుగేండ్లుగా దీనిపైనే డాక్టర్ వందనా సింగ్ పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలోని పలు మెడికల్​ సొసైటీలు వందనా సింగ్​ రీసెర్చ్​ను మెచ్చుకున్నాయి. యూరోపియన్​ సొసైటీ ఆఫ్​ గైనకాలజీ అందించే అలైస్​ అండ్​ ఆల్బర్ట్ నెట్టర్​ ప్రైజ్​కు ఆమె రీసెర్చ్ పేపర్ ఎంపికైంది. భవిష్యత్​లో మహిళల హెల్త్​ రీసెర్చ్​పై మరింత ముందడుగు వేసేందుకు ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని డాక్టర్ వందనాసింగ్​ఆశాభావం వ్యక్తం చేశారు.