
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ల్యాండ్‌మైన్ పేలి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గజ్ని ప్రావిన్స్‌లోని గెరు జిల్లాలో ఆదివారం(మార్చి 31) చిన్నపిల్లలు ఆడుకుంటున్న సమయంలో పేలిపోయిందని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. అందరూ నాలుగు నుండి పదేళ్ల వయస్సు మధ్య గలవారు.
పేలిన ల్యాండ్‌మైన్ దశాబ్దాల క్రితం నాటిదని ఘజనీలోని తాలిబాన్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హమీదుల్లా నిసార్ తెలిపారు. రష్యన్ దండయాత్ర సమయంలో మిగిలిపోయిన పేలని ల్యాండ్‌మైన్ ఆడుకుంటున్నప్పుడు పేలిపోయిందని నిసార్ వెల్లడించారు.
2021లో అమెరికన్ బలగాలు తప్పుకోవడంతో ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళింది. ఆనాటి నుంచి అక్కడి ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. తినడానికి తిండి దొరక్క, చేయడానికి పని దొరక్క బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇతర దేశాలతో కూడా వారికి సంబంధాలు తెగిపోయాయి