బీహార్‌లో పిడుగు వానలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు జూలై 6వ తేదీ శనివారం తెలిపారు. జెహనాబాద్, మాధేపురా, తూర్పు చంపారన్, రోహ్తాస్, సరన్ మరియు సుపాల్ జిల్లాల్లో పిడుగుపాటు మరణాలు సంభవించాయని వారు తెలిపారు.
పిడుగుపాటుకు 9 మంది మృతి చెందడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జెహనాబాద్ జిల్లాలో మూడు మరణాలు నమోదయ్యాయి. మాధేపురాలో ఇద్దరు, తూర్పు చంపారన్, రోహ్తాస్, సరన్, సుపాల్‌లో ఒక్కొక్కరు మరణించారు. గత కొన్ని రోజులుగా బీహార్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 16 బ్రిడ్జిలు కూలిపోయాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం 17మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.