![పిడుగుపాటుతో తొమ్మిది మంది మృతి.. ముఖ్యమంత్రి సంతాపం](https://static.v6velugu.com/uploads/2024/08/nine-killed-in-lightning-strikes-in-odisha-cm-mohan-charan-majhi-condoles_Db3cTB9zN1.jpg)
శనివారం(ఆగష్టు 17) ఒడిశాలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ అసహజ మరణాలపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మయూర్‌భంజ్, బాలాసోర్, భద్రక్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. కియోంజర్, ధెంకనల్, గంజాం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గాయపడిన వారికి సీఎం మాంఝీ ఉచిత చికిత్స ప్రకటించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బార్పాలి బ్లాక్‌లోని మునుపాలి గ్రామ సమీపంలో పొలంలో పడిన పిడుగుపాటుకు 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారీ వర్షాలు..
రానున్న 24 గంటల్లో బోలంగీర్, కలహండి, రాయగడ, గజపతి, గంజాం, కంధమాల్, నువాపాడ, మయూర్‌భంజ్, కియోంజర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు(7 నుండి 11 సెం.మీ.) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.