
- మెదక్ జిల్లాలో ముగ్గురు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు దుర్మరణం
- ఆదిలాబాద్‌లో భార్యాభర్తలు మృతి
- నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలో ఒకరు చొప్పున మరణం
నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై గురువారం 9 మంది మృతి చెందారు. మెదక్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్ధయ్య (50), చాకలి నందు (22) బుధవారం సాయంత్రం కట్టెల కోసం అడవికి వెళ్లారు. రాత్రయినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులతో కలిసి కుటుంబసభ్యులు అడవిలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు మల్లన్న గుట్టలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా సిద్ధయ్య, నందు మృతిచెంది కనిపించారు.
పిడుగుపడి వారు చనిపోయారని పోలీసులు నిర్ధారించారు. అదే జిల్లాలోని కౌడిపల్లి మండలం పీర్ల తండాకు చెందిన గేమ్యా నాయక్ (53) గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా పిడుగు పడటంతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్ట లంబాడి తండాకు చెందిన బానోత్ పీరియా (57) గేదెలను మేపుతుండగా, వర్షం పడటంతో చెట్టు కిందికి పరుగెత్తాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో పీరియా అక్కడికక్కడే మరణించాడు.
మేకలను మేపుతుండగా బాలుడిపై పిడుగు..
నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వత్ గ్రామానికి చెందిన మాగీర్వాడ్శ్రీ(10) గురువారం సాయంత్రం మేకలను మేపడానికి గ్రామ శివారులోకి వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో బాలుడు పక్కనున్న చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కాల్వ గ్రామానికి చెందిన మూడపెళ్లి ప్రవీణ్(28) తన పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి జంగమ్మ, భర్త కృష్ణయ్య, జంగమ్మ తల్లి ఈదమ్మ పొలంలో పత్తి విత్తనాలు విత్తడానికి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటంతో వారంతా చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడడంతో జంగమ్మ(40) అక్కడికక్కడే చనిపోయింది. భర్త కృష్ణయ్యకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో భార్యాభర్తలు..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దొంగర్ గావ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతిచెందారు. కనక సంతోష్ (25), భార్య స్వప్న(23) పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా ఉరుములు మెరుపులతో గాలి దుమారం మొదలైంది. ఆకస్మాత్తుగా వీరిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి మూడేండ్ల పాప ఉంది.