ఆ 9 జాతుల మనుషులు ఏమైన్రు

భూమిపై అప్పట్లో 10 జాతుల మనుషులు ఎవరి అడవుల్లో వాళ్లు, ఎవరి గుహల్లో వాళ్లు బతుకుతూ ఉండేటోళ్లు. జంతువులను వేటాడుతూ లేదా పండ్లు, కాయలు, ఆకులు తింటూ బతికేటోళ్లు. కానీ.. వేల ఏండ్లకు మరో జాతి పుట్టింది. అదే మన హోమో సేపియన్ జాతి. ఈ మనుషుల పుట్టుకే మిగతా జాతుల పాలిట శాపమైపోయింది. అగ్నిపర్వతాలు పేలిపోయి కాదు. ఆస్టరాయిడ్లు ఢీకొట్టి, భూకంపాలు, సునామీలొచ్చి కాదు. కరువుకోరల్లో చిక్కి కాదు. ఆకలికి అలమటించి కూడా కాదు. తోటి మనుషుల వల్లే.. ఆ 9 జాతులు అంతరించిపోయారు!

అప్పటి మనుషులు వీళ్లే…

నియాండెర్తల్స్, హోమో నియాండెర్తల్స్ మనుషులు జంతువులను వేటాడటంలో మొనగాళ్లు. యూరప్ లోని గడ్డి మైదానాల్లో చలిని తట్టుకుంటూ వేటాడి బతికేటోళ్లు. ఆసియాలో డెనిసోవన్స్ ఉండేటోళ్లు. అన్ని జాతుల కంటే పురాతనమైన హోమో ఎరెక్టస్ లు ఇండోనేసియాలో బతికేటోళ్లు. ఇక హోమో రొడెసీన్సిస్ లు సెంట్రల్ ఆఫ్రికాలో ఉండేటోళ్లు. వీళ్లతో పాటు చాలా పొట్టిగా, మెదడు చిన్నగా ఉండే హోమో నేలిడీ మనుషులు సౌత్ ఆఫ్రికాలో, హోమో లుజోనెన్సిస్ మనుషులు ఫిలిప్పీన్స్ లో తిరిగేటోళ్లు. ఇక వింతైన మనుషుల మాదిరిగా ఉండే హోమో ఫ్లోరెసీన్స్ లు ఇండోనేసియాలో, మనకు పెద్దగా తెలియని రెడ్ డీర్ కేవ్ పీపుల్ చైనాలో ఉండేటోళ్లని చెబుతారు. మూడు లక్షల ఏండ్ల కిందటి సీన్ ఇది. కానీ.. హోమో సేపియన్ లు పుట్టాక.. వీటిలో ఒక్కో జాతీ అంతరించిపోయాయని బ్రిటన్ లో ని యూనివర్సిటీ ఆఫ్​ బాత్  ప్రొఫెసర్ నిక్ లాంగ్ రిచ్ అంటున్నారు.

హోమో సేపియన్‌ల రాకతోనే..

హోమో సేపియన్ లు కాకుండా మిగతా 9 జాతుల మనుషులంతా10 వేల ఏండ్ల కిందటే పూర్తిగా కనుమరుగైపోయారు. ఆయా జాతుల మనుషులు అంతరించిపోవడానికి ఎలాంటి ప్రకృతి విపత్తులు కారణం కాదని, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో 2.60 లక్షల ఏండ్ల కిందట పుట్టిన కొత్త జాతి హోమో సేపియన్‌సే కారణమని రీసెర్చర్లు చెబుతున్నారు. వీరి నుంచే ఆధునిక మానవులు 40 వేల ఏండ్ల కిందట ఆఫ్రికా నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించారని, దీంతో వారు వెళ్లిన ప్రతి చోటా మిగతా జాతుల మనుషుల ప్రాణాలకు గండం ఏర్పడిందనీ అంటున్నారు.

మన తెలివే.. వారికి శాపం!

పది రకాల జాతుల్లో హోమో సేపియన్ లే చాలా తెలివైనవాళ్లట. మిగతా జాతుల్లో జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉండటంతో పాటు వారు ప్రకృతిని నాశనం చేసే స్థాయిలో వ్యాప్తి చెందేవారు కాదట. కానీ హోమో సేపియన్ లు వేగంగా జనాభాను పెంచుకుంటూ, కొత్త పద్ధతులు డెవలప్ చేసుకుంటూ, వ్యవసాయం కూడా మొదలుపెట్టారట. అన్నిరకాలుగా తెలివిమీరిపోవడంతో జంతువులను వేటాడం, ఇతర జాతుల మనుషులతో కొట్లాటల్లోనూ పైచేయి సాధించారని రీసెర్చర్లు పేర్కొంటున్నారు. ఈటెలు, బరిసెలు, గొడ్డళ్లు, బాణాలు, పదునైన రాళ్లను, భాష, సైగలను వాడటంలో ఆరితేరారని అంటున్నారు. గుంపు మధ్య కోఆర్డినేషన్, శత్రువులను ప్లాన్ చేసి మరీ దొంగదెబ్బ తీయడం, గెరిల్లా పోరాటం చేసేంతటి తెలివితేటలు ఉండటంతో వీరి చేతుల్లో మిగతా జాతుల జనాలు ఘోరంగా చనిపోయేవాళ్లని చెబుతున్నారు.

ఆధారాలు ఉన్నాయా?

ఉత్తర అమెరికాలో 9 వేల ఏళ్ల క్రితం నాటి కెన్నెవిక్ మనిషి అస్థిపంజరం దొరికింది. ఆ అస్థిపంజరం తుంటిలో గుండ్రటి ఆయుధంతో కొట్టడం వల్ల రంధ్రం పడినట్లు తేలింది. కెన్నాలోని నాటరక్ సైట్ వద్ద 10 వేల ఏండ్ల నాడు ఊచకోత కోసిన 27 మంది మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లల అస్థిపంజరాలు దొరికాయి. ఆ ఎముకలకు తగిలిన గాయాలు, అక్కడ లభించిన ఆయుధాలు, ఆధారాలను బట్టి.. అవి కచ్చితంగా జాతుల మధ్య పోరాటాలే అని తేల్చారు. మరికొన్ని చోట్ల దొరికిన నియాండెర్తల్ మనుషుల అస్థిపంజరాలను పరిశీలించగా, హోమో సేపియన్ లు వాడే ఆయుధాల వల్లే వాళ్లు చనిపోయినట్లు గుర్తించారు. అయితే, ఇతర మానవ జాతులూ కొట్లాటలకు దిగి ఉండవచ్చని అంటున్నారు. అలాగే కొన్నిచోట్ల ఇతర జాతులతో హోమో సేపియన్ లు కలిసిపోయారని, అందువల్లే కొందరు యురేసియన్ ప్రజల్లో నియాండెర్తల్ డీఎన్ఏ, ఆస్ట్రేలియన్ ప్రజల్లో డెనిసోవన్స్ డీఎన్ఏ ఆనవాళ్లు కనిపించాయని పేర్కొంటున్నారు.