మరో నెలరోజుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తి కానున్నాయి. రంగురంగుల కాంతులీనే డా.బీఆర్అంబేద్కర్ సచివాలయం, శత్రు దుర్భేద్యమైన ప్రగతిభవన్, ట్యాంక్‌బండ్ మీద 125 అడుగుల విగ్రహం, ప్రతి నియోజకవర్గానికి పది లక్షల దళిత బంధు పథకం, పెద్దపెద్ద ఐటీ కంపెనీలు ఇలాంటి కళ్లకు కనబడే పాలకుల దృష్టిలో ప్రభుత్వం కనబరిచిన అభివృద్ధి ఇది. కాగా లిక్కర్ స్కాం దందా, పేద ప్రజల దోపిడీ, పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత గోస, రోడ్లపైకి వచ్చి భద్రత కోసం పోరాడుతున్న నిరుద్యోగుల నిస్సహాయత, ఎనిమిదివేల మంది రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ భూముల అమ్మకాలు. ఇవి తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు తెలిసిన కళ్లారా చూస్తున్న మార్పు. అయితే పాలకులు వందల కోట్ల ఖర్చుతో ప్రచారాల ద్వారా చెప్పుకుంటున్న అభివృద్ధి, ప్రజలు తమ అనుభవంలో, అవగాహనలో ఉన్న అభివృద్ధికి ఎంతో తేడా ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన 1300 మంది విద్యార్థి అమరవీరులు కోరుకున్నది మాత్రం జరగలేదు. జూన్2వ తేదీన అమరవీరుల జ్ఞాపకార్థం స్థూపం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అది కూడా రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి, మూడోసారి గెలవాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటివరకు అమరుల కుటుంబాలకు ఏమైనా సాయం అందిందా లేదా అనేది ప్రభుత్వ పెద్దల మనస్సాక్షికి వదిలేద్దాం.
సమ్మెలు, ధర్నాలు, ఉండవనుకున్నం
తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదం, నేడు నిరాశగా మారింది. ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కు వచ్చే నీళ్లు, పాలమూరు, నడిగడ్డ రైతుల పొలాలు తడపడానికి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 3 లక్షల పైనే ఉన్నపుడు అంగన్వాడీ టీచర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, వీఆర్ఏ లకు కనీస వేతనం ఎందుకు అందడంలేదు. దేశంలో జరగబోయే ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా భరించే సొమ్ము ఉన్నపుడు, ప్రతినెలా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలెందుకు రావడం లేదు? వందలకోట్లు, వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ప్రైవేటు కంపెనీలలో తెలంగాణ బిడ్డలకు జరిగిన నియామకాలు ఎన్ని? కాళేశ్వరం వంటి లక్షల కోట్ల, వేల కోట్ల ప్రాజెక్టులు ఎలాగూ తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఇవ్వలేదు, కనీసం నూతన సచివాలయానికి సిమెంట్, ఇసుక మోసిన కార్మికులలో తెలంగాణ బిడ్డలు ఉన్నారా? లేరు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు ఆగడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చేసినట్లుగా, రాష్ట్రం వచ్చిన తర్వాత ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు ఉండవనుకున్నం. కానీ బీఆర్ఎస్ నిరంకుశ పాలన వల్ల ఉద్యోగులే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురైంది. హక్కుల కోసం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం సమ్మెలు, ధర్నాలు చేయక తప్పడంలేదు. నిరుద్యోగ యువకులు నిన్నమొన్నటి వరకు కొట్లాడి నోటిఫికేషన్లు సాధిస్తే, ఉద్యోగ పరీక్షల పేపర్ లీకేజీ కావడంతో లక్షల మంది విద్యార్థులు తిరిగి రోడ్లపైకి ఎక్కారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల కాక, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందక మనోవేదనకు గురవుతున్నారు.
భూములు లాక్కుంటున్నారు
లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమణకు గురవుతున్నాయి. అభివృద్ధి పేరుతో పేదల భూములనే లాక్కుంటున్నారు. ఆదాయం కోసం అసైన్డ్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ధరణిలో ఉన్న లోపాల వల్ల వేలాది మంది రైతులు భూ సమస్యల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రుణ మాఫీ హామీ నెరవేరక అప్పులపాలై ఉరితాళ్ల వైపు చూస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా, ఆనందంగా లేరు. సొంతపాలనలో ఉన్నామన్న సంతోషం లేదు. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఇందుకేనా అనే నిరాశ, నిస్సహాయతలో తెలంగాణ ప్రజానీకం ఉంది. ఉద్యమ పార్టీ అని నమ్మి మోసానికి గురయ్యామన్న భావన ప్రజల్లో వచ్చింది.
ప్రత్యామ్నాయ నాయకత్వం
ప్రతిక్షపార్టీలు ఏవీ ప్రభుత్వ విధానాలపై నిజాయితీగా, మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదు. ప్రతి పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వర్గ ప్రయోజనాలకోసం ఆలోచిస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన తప్ప ప్రజా సమస్యలపై నిజాయితీతో పోరాడే పార్టీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుడు తప్ప, ప్రత్యామ్నాయం చూపే నాయకుడు లేడు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయం గురించి ఏ పార్టీ మాట్లాడటం లేదు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఆయా పార్టీల్లో ఉండే ప్రాధాన్యత అనేది స్పష్టం చేయడం లేదు. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ గత 213 రోజులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్రంలో యాత్ర చేస్తూ పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీగా బీఎస్పీని నిలబెట్టారు. పేదలకు రాజ్యాధికారం దక్కాలన్నా ఏకైక ఆకాంక్షతో ఆయన ముందుకు సాగుతున్నారు.
బీఎస్పీ తెలంగాణ భరోసా సభ
అందుకే పరాయి పాలనలో అరవై ఏళ్లు మోసపోయిన ప్రజలు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా గత తొమ్మిదేళ్లుగా మోసానికి, అన్యాయానికి గురవుతున్నారు. దోపిడీ పాలకుల నుంచి విముక్తి కల్పిచడానికి, ఆధిపత్య వర్గాలకు చెందిన పార్టీల కుట్రలను విప్పి చెప్పడానికి, రాష్ట్రంలో బీఎస్పీ అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాటం, వివిధ అంశాలపై ఆయన కల్పిస్తున్న అవగాహనతో తెలంగాణలో బహుజనులు ఆలోచించడం మొదలు పెట్టారు. నియంత పాలనను వ్యతిరేకిస్తూ అంతా ఒకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలందరికీ బీఎస్పీ తోడుగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు బీఎస్పీ పాలనలో సంపూర్ణ, సామాజిక న్యాయం అందుతుందని తెలపడానికి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో జరగబోయే తెలంగాణ భరోసా సభకు బెహన్ మాయావతి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేదలకు లక్షల ఎకరాల భూమి పంచి ఇచ్చి, ఒక్క లీకేజీ లేకుండా లక్షల ఉద్యోగాలు కల్పించి, అతిపెద్ద రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడిన గొప్ప నాయకురాలిగా దేశవ్యాప్తంగా కుమారి మాయావతి ఘనత తెలియంది కాదు. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలు వేలాదిగా తరలి, దోపిడీ పాలకులకు మన బహుజన శక్తి చూపడానికి రావాలని మనవి.
బెహన్ జీ మద్దతు
ఇలాంటి చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి మే 7వ తేదీన బహుజన్ సమాజ్‌పార్టీ జాతీయ నాయకురాలు, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బెహన్జీ కుమారి మాయావతి వస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, వేలాది మంది విద్యార్థుల చదువు ఆగమైతుంటే, రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఆనాడు కుమారి మాయావతి 36 మంది బీఎస్పీ ఎంపీలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని నమ్మి, ప్రజల బాగు కోసం తోడ్పడాలనుకుంది. కానీ తొమ్మిదేళ్ల కాలంలో పేదల బతుకులు మారలేదని, కేవలం పాలకులు మాత్రమే బాగుపడ్డారని గుర్తించి దు:ఖంలో ఉన్న తెలంగాణ ప్రజలను ఓదార్చడానికి, భరోసా ఇవ్వడానికి ఆమె వస్తున్నారు.
- దూడపాక నరేష్,ఓయూ