వందేండ్ల పోరాట చరిత్ర, సాయుధపోరాటం మొదలుకొని తుది దశ తెలంగాణ పోరాటం వరకు అనేక ప్రాణ త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని ఉద్యమ శక్తులు పాలిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గద్దెనెక్కించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి ఆంధ్ర ప్రాంతానికి శత్రువుగా మారిన కాంగ్రెస్ పార్టీని సైతం కాదని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు గెలిపించారు. ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు’ కేసీఆర్ పాలన సాగింది, సాగుతోంది.
అందమైన అబద్దాలు
అందమైన అబద్దాన్ని చెప్పడంలో మన సీఎం కేసీఆర్ ఆరితేరారు. తొమ్మిదేండ్ల పాలనలో కేసీఆర్ చేసింది అదే. మొదటిసారి గద్దెనెక్కిన నాటి నుంచి ఎన్నో అభూత కల్పనలతో పాలన సాగించారు. ప్రతిపక్షాలు, కొత్త కూటములు ఎన్నికలకు సిద్ధం కాక ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోయి ప్రతిపక్షాలు, ప్రగతిశీల శక్తులపై సర్జికల్ స్ట్రైక్ చేశారు, కరెన్సీ ప్రయోగించారు. తొండిగా రెండవసారి అధికారంలోకి వచ్చారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనడం, కుల సంఘాలను, ప్రజాసంఘాలను చీల్చడం, లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టడం, ఏకంగా ధర్నా చౌక్ నే ఎత్తివేసి ఉద్యమాలను అణచివేసారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున పెరుగుతున్న వ్యతిరేకతను ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ ఆ వ్యతిరేకత మరింత పెరగకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నించే యువతను చదువులకు పరిమితం చేసారు. నానాటికి బలహీన పడుతున్న పార్టీని బతికించుట కోసం ఒక ఏడాది ముందుగానే దశాబ్ది ఉత్సవాలు జరిపారు.
దళారీ పెట్టుబడి రాజకీయాలు
అభివృద్ధి పేరుతో ఉన్నవి కూలగొట్టి, కొత్తవి కట్టి, కమీషన్లు కొట్టి దళారీ పెట్టుబడి రాజకీయాలకు తెర లేపారు. తన నియంత పాలనను వ్యతిరేకించిన ఈటల రాజేందర్ లాంటి వాళ్లనెందరినో బయటకు నెట్టారు. ఉద్యమ శక్తులను రాజకీయ సమాధి చేయడం కోసం దళిత బంధు లాంటి ప్రలోభ పథకాలు ప్రవేశపెట్టడం, గౌడలకు, ఎస్సీ, ఎస్టీ లకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించడం, ఎన్నికల్లో ఆయా వర్గాలను ప్రలోభ పెట్టడానికే. తెలంగాణ వచ్చిన ఏడేండ్ల నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. చేసిన వాగ్ధానాలను అమలుపరిచే సంగతి పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రంలోని బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర అధికార పక్షాల మధ్య సమన్వయంతో పాలన కొనసాగించాల్సింది పోయి అధికార పక్షాల మధ్య యుద్ధానికి దారితీసే విధంగా కేసీఆర్ రాజకీయ క్రీడ కొనసాగించారు. ఎన్నడూ లేని ధాన్యం లొల్లిని ముందుకు తెచ్చి ఏకంగా అధికార పార్టీయే రోడ్ల మీద ధర్నాలు చేసింది. కేంద్రం ధాన్యం కొనదని ప్రజలను తప్పుదోవ పట్టించి అయోమయానికి గురిచేశాడు.
ఉద్యోగస్తుల్లో ఉన్న వ్యతిరేకత నుంచి భవిషత్ లో ప్రమాదం జరగకుండా ఉండడం కోసం రాత్రికి రాత్రి 317 జీవో తీసి, ఉద్యోగస్తులను చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీలు చేసారు. ప్రతిపక్షాల బలం తగ్గించడం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ నేడు ఆ జిల్లాలను అడ్డుపెట్టుకొని ఉద్యోగస్తులను చిన్నా బిన్నం చేసారు. చివరకు భార్యను ఒక జిల్లాకు, భర్తను మరొక జిల్లాకు పంపి గోస పెట్టారు. ఆనాడు ఆర్టీసీ కార్మికులను చెరబట్టిన కేసీఆర్ నేడు మొత్తం ఉద్యోగస్తులనే ఆగం చేస్తున్నారు. జర్నలిస్టు రఘును, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి స్వేచ్ఛను హరించి, హక్కులను కాలరాసి భయానక పాలన సాగిస్తున్నారు. ఉద్యోగ సంఘాలను, ప్రజా సంఘాలను క్రమంగా బలహీనపరుస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడైన శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యే గా, మంత్రిగా అవకాశం కల్పించి ఆ సంఘాన్ని నిర్వీర్యం చేసారు. దేవీప్రసాద్‌కు బెవరేజెస్ చైర్మన్ చేశారు. కారం రవీందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ లో సభ్యునిగా అవకాశమిచ్చి ఆ సంఘాన్ని లోబరచుకొన్నారు.
భవిష్యత్ ను నాశనం చేయడమేనా?
పాలన అంటే ప్రజలపై అధిక పన్నులు వేయడం, ఆర్ టీసీ భూములను లీజుకు ఇవ్వడం, ప్రభుత్వ భూములు అమ్మడం, రాజీవ్ స్వగృహ ఆస్తులను అమ్మడమే పరమావధిగా చేసుకున్న కేసీఆర్, ఉత్పత్తి సంబంధిత ఆదాయం కాకుండా అధిక పన్నులు, ఉత్పత్తేతర విధానాల ద్వారా ఆదాయం పెంచుకుంటున్నారు. ఖాళీ ఇళ్ల స్థలాలపై ఎల్ ఆర్ ఎస్ పేరుతో భవిష్యత్ లో చెల్లించాల్సిన సొమ్మును ఇప్పుడే గుంజుతూ, రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేస్తున్నారు. భూముల ధరలు పెంచి రిజిస్ట్రేషన్ ద్వారా, మద్యం టెండర్లు, మద్యం అమ్మకాల రెట్టింపు ద్వారా, ఇసుక అమ్మకాల ద్వారా ఆదాయం రాబడుతున్నారు. ప్రజా ప్రతినిధుల జీత భత్యాల కోసం, ప్రభుత్వ నిర్వహణ కోసం, మీడియా ప్రకటనల కోసం హద్దుమీరిన వ్యయాలు చేస్తూ... ప్రజలకు కావల్సిన విద్య, వైద్యం, ఉపాధి రంగాలను నీరుగార్చారు. ప్రభుత్వ విధానాలన్ని సంపన్నుల, వ్యాపారుల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయే తప్ప సామాజిక అభివృద్ధికి, సాధారణ ప్రజల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. నిరుద్యోగుల బలవన్మరణాలు జరుగుతున్నా కేసీఆర్ కు కాసింత కనికరం కలగడం లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగక పోగా, డిగ్రీలు, పీజీ లు చదివిన ఉన్నత విద్యావంతులు కూలీలుగా మారుతున్నారు.
సంక్షేమం పేరుతో సంక్షోభం
ఫీజు రియింబర్స్‌మెంట్ లను తగ్గించి బలహీన వర్గాల విద్యాభివృద్ధికి అడ్డుకట్ట వేసారు. ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా చేసిన ఘనత ఆయనది. కోటి ఎకరాలకు నీరు పారిస్తామన్న కేసీఆర్ నీరుకు బదులు పల్లెల్లో వాడవాడకు బెల్టు షాపులతో మద్యాన్ని పారిస్తున్నారు. బంధుల పేరుతో ప్రజలను బందీలను చేయాలనుకుంటున్నారు. డల్లాస్ చేస్తామన్న వరంగల్ నగరం లాంటి వాటిని ఖల్లాస్ చేసారు. నేడు తెలంగాణ అంటే, కుక్కల దాడులతో మరణాలు, కోతుల బెడదతో చెట్లు నరికేసుకోవడం, దోమలతో డెంగ్యూ జ్వరాలతో మరణాలు, డ్రగ్స్ కు గోవా తర్వాత తెలంగాణ అడ్డాగా మారడం అయిపోయింది. గ్రామ పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్, ఉప సర్పంచ్ లు సమిధలవుతున్నారు. అంతిమంగా తెలంగాణ అవినీతిలో అందలమెక్కి, అభివృద్ధిలో అడుక్కు పోయి అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్ల తెలంగాణగా మారింది. ఇలాంటి దుర్భర పాలన కొనసాగిస్తూ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చూశాం. తొమ్మిదేండ్ల తొండి పాలన పట్ల ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులపై ఉంది.
సాయిని నరేందర్, సోషల్ ఎనలిస్ట్