వికసిత్ భారత్–2047 థీమ్​తో..  ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్​

వికసిత్ భారత్–2047 థీమ్​తో..  ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్​
  •  హాజరుకానున్న బీరేన్ సింగ్.. ప్రధానితో ప్రత్యేకంగా భేటీకి చాన్స్
     
  •     నిరసన తెలిపేందుకు హాజరవుతానన్న మమత
  •     బాయ్ కాట్ చేసిన తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌ కల్చరల్ సెంటర్‌‌లో నిర్వహించే ఈ మీటింగ్​కు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్​ చేసింది.

‘వికసిత్ భారత్–2047’ థీమ్​తో కొనసాగే ఈ మీటింగ్​లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌‌ను తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.  గ్రామీణ, పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఏం చేయాలన్నదానిపై అందరి అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.  ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా రోడ్ మ్యాప్‌‌ రూపొందించనున్నారు. 

మీటింగ్​కు దూరంగా పలు రాష్ట్రాలు

కేంద్ర బడ్జెట్‌‌లో తమ రాష్ట్రాలపై పక్షపాతం చూపించారని ఆరోపిస్తూ నీతి ఆయోగ్​ మీటింగ్​కు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్‌‌ సీఎం సుఖ్విందర్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదు. తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్‌‌తో పాటు ఆప్​ నేతృత్వంలోని పంజాబ్‌‌, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా శనివారం నాటి  నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాయి.

హాజరు కానున్న మణిపూర్​ సీఎం

మణిపూర్ సీఎం  బీరెన్ సింగ్ నీతి ఆయోగ్​ మీటింగ్​లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని  మోదీని కలిసే సమయం వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం సహాయాన్ని కోరుతామన్నారు. ప్రధానిని కలిసి మణిపూర్​లో పరిస్థితి వివరిస్తానని, రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు.

ఇటీవల మణిపూర్​లో హింస చెలరేగినప్పుడు ప్రధాని కనీసం రాష్ట్రాన్ని సందర్శించలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పీఎంను  ఆ రాష్ట్ర సీఎం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నీతి ఆయోగ్​లో కేంద్రాన్ని నిలదీస్త: మమత   

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్​లో కేంద్రం పక్షపాతం చూపించిందని వెస్ట్​ బెంగాల్​సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదే విషయంపై నీతి ఆయోగ్​ మీటింగ్​లో కేంద్రాన్ని నిలదీస్తానని, అందుకే సమావేశానికి హాజరువుతున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్​ మీటింగ్​లో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే నిరసనగా మీటింగ్​ను బహిష్కరించి బయటకు వస్తానని చెప్పారు.