
- జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా
- ఒక్కటే త్రో చేసి 89.34 మీటర్లతో టాప్ ప్లేస్
- క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే కిశోర్ జెనా ఔట్
- రేపు రాత్రి ఫైనల్ పోటీలు
తన రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులందరినీ జావెలిన్ త్రో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా ఖుషీ చేశాడు. పారిస్ గేమ్స్‌లో దేశ స్వర్ణ ఆశలు మోస్తున్న చోప్రా అథ్లెటిక్స్ స్టేడియంలోకి అడుగు పెట్టిన వెంటనే అదరగొట్టాడు. క్వాలిఫికేషన్ రౌండ్ పోటీల్లో ఒక్కటే త్రో చేసి ఈ సీజన్ బెస్ట్ నమోదు చేస్తూ.. టాప్ లేపేశాడు. క్వాలిఫికేషన్‌లో 32 మంది పోటీ పడితే.. ఒక్కరు కూడా మన బల్లెం వీరుడికి చేరువ కాలేకపోయారు. ఊహించినట్లుగానే నీరజ్ వచ్చాడు.. విసిరాడు.. ఫైనల్ చేరాడు. ఇక రేపు రాత్రి జరిగే ఫైనల్లో అతను స్వర్ణ పతకం అందుకొని మరోసారి జగజ్జేతగా నిలవడం ఒక్కటే మిగిలింది.
పారిస్ : డిఫెండింగ్ చాంపి యన్ నీరజ్ చోప్రా పారిస్ గేమ్స్‌లోనూ స్వర్ణభేరి మోగించేందుకు తొలి అడుగు బలంగా వేశాడు. మెన్స్ జావెలిన్ త్రోలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీరజ్ ఒకే ఒక్క త్రో చేసి క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్–బిలో బరిలోకి దిగిన నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్లు విసిరాడు. ఇది చోప్రా సీజన్ బెస్ట్ పెర్ఫామెన్స్ కావడం విశేషం. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కు 84 మీటర్లను దాటడంతో తను మరో ప్రయత్నం కూడా చేయలేదు.
నీరజ్‌కు బలమైన పోటీదారులుగా భావిస్తున్న గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 88.63 మీటర్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలవగా, జర్మనీ స్టార్ జులియన్ వెబర్ 87.76 మీటర్లతో మూడో ప్లేస్ సాధించాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వడ్లెచ్ 85.63 మీటర్లతోనే సరిపెట్టాడు. ఇదే ఈవెంట్‌లో గ్రూప్–ఎలో పోటీ పడ్డ మరో ఇండియన్ కిశోర్ జెనా నిరాశపరిచాడు. మూడు ప్రయత్నాల్లో అత్యధికంగా 80.73 మీటర్ల దూరం మాత్రమే విసిరిన అతను క్వాలిఫికేషన్ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయాడు. తన గ్రూప్‌లో 9వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు.
గతేడాది అక్టోబర్‌లో ఆసియా గేమ్స్‌లో 87.54 మీటర్ల త్రోతో ఒలింపిక్ బెర్తు సాధించిన జెనా ఆ తర్వాత ఒకేసారి 80 మీటర్ల మార్కు దాటగలిగాడు. కాగా, జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో 84 మీటర్ల దూరం విసిరిన వాళ్లు లేదంటే రెండు గ్రూపుల్లో కలిపి టాప్12లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫికేషన్‌లో తొమ్మిది మంది నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించడం చూస్తే ఇందులో పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పహల్‌కు నిరాశ
విమెన్స్ 400 మీటర్ల ఈవెంట్‌లో ఇండియా అథ్లెట్ కిరణ్ పహల్ రెండో ప్రయత్నంలోనూ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. రెపిఛేజ్ రౌండ్ హీట్‌లో 52.59 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన ఆమె తన హీట్‌లో ఆరో, చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో ఇండియా మెన్స్ టీమ్ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో ఇండియా 0–3తో బలమైన చైనా చేతిలో చిత్తయింది. మొదటిదైన డబుల్స్‌లో హర్మీత్ దేశాయ్–మానవ్ ఠక్కర్ 2–11, 3–11, 7–11తో లెజెండరీ మా లాంగ్–చుక్విన్ వాంగ్ చేతిలో ఓడారు. సింగిల్స్ మ్యాచ్‌లో శరత్ కమల్ 11–9, 7–11, 7–11, 5–11తో ఫాన్ జెండాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో సింగిల్స్‌లో మానవ్ 9–11, 6–11, 9–11తో చుక్విన్ చేతిలో ఓడటంతో ఇండియా ఇంటిదారి పట్టింది.
అప్పుడూ అంతే
నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ పెర్ఫామెన్స్‌ను. పారిస్‌లో దాదాపు రిపీట్ చేశాడు. 2021 ఆగస్టు 4న జరిగిన టోక్యో క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ నీరజ్ ఒకే ఒక్క త్రో చేసి 86.65 మీటర్లతో ఫైనల్ చేరాడు. సరిగ్గా మూడు సంవత్సరాల, రెండు రోజుల తర్వాత చోప్రా మరోసారి మాస్టర్ త్రోతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. చోప్రా తన సీజన్ బెస్ట్ ( 89.34 మీ) పెర్ఫామెన్స్ చేయడంతో తనకు అందని ద్రాక్షగా ఉన్న 90 మీటర్ల మార్కును ఫైనల్లో అందుకొని స్వర్ణం నెగ్గాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.