వనపర్తి, వెలుగు : మరోసారి బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం నామినేషన్ వేసిన అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాకీలు పెట్టి లేపినా వనపర్తి లో కాంగ్రెస్ లేవదన్నారు.40 ఏండ్లు కాంగ్రెస్ కు సేవచేసిన చిన్నారెడ్డిని కాదని, 40 రోజుల కింద పార్టీలో చేరి పైసలిచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని విమర్శించారు.
మంత్రిగా వనపర్తిని ఎంత అభివృద్ధి చేశానో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు వనపర్తికి వచ్చాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రోడ్ల విస్తరణ చేశానన్నారు. మరోసారి అవకాశం ఇస్తే వనపర్తిని ఇంకా అభివృద్ధి చేస్తానన్నారు. వనపర్తిని రాష్ట్రంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గాల్లో ఒకటిగా నిలబెట్టానన్నారు. కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, ప్రమోద్ రెడ్డి, వాకిటి శ్రీధర్, రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.