మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్​ను అడ్డుకున్న వాల్మీకి బోయలు

గద్వాల, వెలుగు: మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ ను వాల్మీకి బోయలు అడ్డుకున్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కేంద్రంలో 20 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మంత్రి నిరంజన్​రెడ్డి కాన్వాయ్​మంగళవారం ఫ్లైఓవర్ సమీపం నుంచి వెళుతుండగా అడ్డుకున్నారు. నిరంజన్ రెడ్డి కారు దిగి వారితో మాట్లాడారు. ఎస్టీ జాబితాలో చేర్చడమనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని, రాష్ట్ర సర్కార్ తరపున ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే కొర్రీలు పెట్టి నాలుగేళ్ల తర్వాత బిల్లును వెనక్కి పంపించిందన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అనంతరం వాల్మీకి బోయలు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు వైన్డింగ్ రాములు, కోటేశ్, నారాయణరెడ్డి, నాగశంకర్, వెంకటేశ్​నాయుడు 
తదితరులు పాల్గొన్నారు.