నిరంజన్ రెడ్డి సవాల్ రెడీ..ఎప్పుడు పిలిచినా వెళ్త: రఘునందన్ రావు

నిరంజన్ రెడ్డి సవాల్ రెడీ..ఎప్పుడు పిలిచినా వెళ్త: రఘునందన్ రావు

మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన సవాల్ కు సిద్ధమన్నారు  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్  రావు.  నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని..ఎప్పుడు పిలిచానా  వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నిరంజన్ రెడ్డి కేవలం వనపర్తికి మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావుకు   ఏప్రిల్ 23న ఆదివారం మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను  తాను కబ్జా చేశానని  రఘునందన్ ఆరోపణలు చేయడం  సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయొద్దని... సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో రఘునందన్ రావు తెలుసుకుని మాట్లాడాలన్నారు.  రఘునందన్  వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు నిరంజన్ రెడ్డి.

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని  కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు  ఇటీవల ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో  ఫాంహౌజ్ నిర్మించారని  తెలిపారు.  80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు.   కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు.