నిర్జల ఏకాదశి2024: భీముడు ఆచరించిన వ్రతం ఏమిటో తెలుసా...

నిర్జల ఏకాదశి2024:  భీముడు ఆచరించిన వ్రతం ఏమిటో తెలుసా...

జ్యేష్ట శుక్ల ఏకాదశిని  ( జూన్​ 18) నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టినవారు నీటిని కూడా తాగరాదు. అందుకే ఈ ఏకాదశికి ఆ పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో నిర్జల ఏకాదశి అత్యంత కఠినమైనది. ఎంతో మహిమాన్వితమైనది కూడా. ఈ ఏకాదశినే పాండవ ఏకాదశి లేదా భీమ ఏకాదశి అంటారు. నియమ నిష్టలతో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు ఆచరించిన ఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశిని ఆచరించినవారు తనకు అత్యంత ప్రీతి పాత్రులనీ, ఇహలోకం లో వారి సకల అభీష్టాలనూ నెరవేర్చి, సర్వపాపాలనూ హరించి జన్మాంతం లో తన సాన్నిధ్యానికి చేర్చుకుంటాననీ శ్రీ మహావిష్ణువు పలికిన విధంగా మార్కండేయ పురాణం చెబుతుంది.

పాండవులు శ్రీకృష్ణునికి పరమ భక్తులు. వారు ప్రతి ఏకాదశినాడూ ఉపవాస దీక్షను చేసే వారు. అయితే మహాబలుడైన భీమసేనుడు ఉపవాసదీక్షను చేయలేకపోయేవాడు. ఆయన ఈ విషయమై చింతిస్తుండగా శ్రీ కృష్ణుడు భీముని తో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలను ఆచరించిన ఫలితం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు భీమసేనుడు అతి కఠినమైన నిర్జల ఏకాదశిని భక్తిగా ఆచరించి 24 ఏకాదశి వ్రతాల పుణ్యఫలాన్ని సంపాదించుకున్నాడు. అందుచేత ఈ రోజును( జూన్​ 18) భీమ ఏకాదశి అని కూడా అంటారు.

నిర్జల ఏకాదశిని ఆచరించదలచినవారు జ్యేష్ట శుక్ల ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే స్నానాదికాలను ముగించుకుని ఉపవాస దీక్షను ప్రారంభించాలి. నిర్జల ఏకాదశినాడు వ్రతదీక్షలో ఉన్నవారు మంచినీరు కూడా తీసుకోరాదు. నిరంతర విష్ణుధ్యానం లో గడపాలి. విష్ణు సహస్రనామాలని పఠించాలి.

హిందూ సంప్రదాయాల ప్రకారం, నిర్జల ఏకాదశి వ్రతాన్ని రెండవ పాండవ సోదరుడైన భీముడికి వ్యాస మహర్షి వివరించాడు. ఈ కారణంగానే ఈ వ్రతాన్ని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

మహాభారతం .. పద్మ పురాణం రెండింటిలోనూ నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్పబడింది. పాండవులు అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు, కానీ భీముడు మాత్రం తిండిపోతు ఆకలిని భరించలేక ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయాడు.
అయితే, భీముడు కూడా ఏకాదశి వ్రతం యొక్క పుణ్యాన్ని పొందాలని కోరుకున్నాడు. అందుకే, ఒకేసారి ఆహారాన్ని ఆస్వాదించడానికి .... ఉపవాసం కూడా పాటించడానికి ఒక మార్గాన్ని కనుగొనమని భీముడు వ్యాస మహర్షిని వేడుకున్నాడు. ఋషి..  భీముడికి  ఉపవాసం పాటించడం సాధ్యం కాదని చెప్పాడు. అయితే, ఒకేసారి 24 ఏకాదశి వ్రతాల ఫలాన్ని పొందే ఒక అద్భుతమైన మార్గాన్ని ఋషి భీముడికి సూచించాడు. అదే నిర్జల ఏకాదశి వ్రతం.

జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షంలో  ఏకాదశి రోజున .. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని వ్యాస మహర్షి భీముడికి సలహా ఇచ్చాడు. భీముడు ఆ ఋషి వాక్కులను పాటించి, నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దీనివల్ల, భీముడు ఒకేసారి 24 ఏకాదశి వ్రతాల పుణ్యాన్ని పొందగలిగాడు.

 నిర్జల ఏకాదశి. భీముడు స్వయంగా ఆచరించిన ఉపవాసం కనుక భీమ ఏకాదశిగానూ జరుపుకుంటారు. ఈ రోజు నీటిని దానం చేసిన వారికి కోటి పుణ్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ మహిమాన్వితమైన రోజున పేదవారికి నీటిదానం చేయాలి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలాలు, వివిధ దానాల ఫలాలు లభిస్తాయి. అంతేగాకుండా పుణ్య ఫలం చేకూరుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు తమ పాపాల నుండి విముక్తులవుతారు. ఇంకా వారి పూర్వీకులు కూడా వంద తరాల పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే ఆ రోజున విష్ణుమూర్తి , వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భాగం కావడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.