- ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ/కొల్లాపూర్,వెలుగు: తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం 8 కేటగిరీల్లో అవార్డులు ఈ ప్రకటించింది. ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామం ‘క్రాఫ్ట్స్’కేటగిరీలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ‘స్పిరిచ్యువల్ వెల్నెస్’కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామాలు నిలిచాయి.
వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య, సోమశిల జిల్లా పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌కర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
మంత్రి జూపల్లి హర్షం..
నిర్మల్, సోమశిలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డు రావడం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన కొల్లాపూర్‌లోని సోమశిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సోమశిల గ్రామస్తులకు, కళాకారులకు, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందికి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో టూరిస్ట్ డెస్టినేషన్‌గా తెలంగాణ పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ కళలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, కళాకారుల నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.