నిర్మల్, వెలుగు: నిర్మల్ టౌన్ మాస్టర్ ప్లాన్ను బీఆర్ఎస్ నేతలు, వారి బంధువులకు అనుకూలంగా తయారు చేశారని, ఈ వ్యవహారం వెనుక కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. దీంతో ఉమ్మడి జిల్లాల బీజేపీ నేతలు, కార్యకర్తలు నిర్మల్ చేరుకొని ఆయన దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ, మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం నిర్మల్ బంద్కు పిలుపునిచ్చారు. దీనికి అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామారావు పటేల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డితో బాటు ఇతర లీడర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఇన్చార్జి అయనగారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, సుహాసిని రెడ్డి, హరినాయక్, జడ్పీటీసీ జాను బాయి, బాధిత రైతులు పాల్గొన్నారు .