బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీలో స్వాతి ప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్ధన్‌తో కలిసి 17 కమిటీల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఆత్మహత్యల ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులంతా సానుకూల దృక్పథంతో ఉండాలని, సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
అనంతరం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లోని ఆడిటోరియంలో పీయూసీ విద్యార్థులతో కలెక్టర్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. మనిషి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ధైర్యంగా అధిగమించి ముందుకు సాగాలన్నారు. వీసీ మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు, లెక్చరర్లు, ఉద్యోగులు, పరిపాలన అధికారులు, ప్రభుత్వ సహకారంతో వర్సిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ రాజేశ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, వివిధ విభాగాల అధికారులు, క్యాంపస్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, తహసీల్దార్ పవన్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు.
క్రీడలతో ఆరోగ్యం
ముథోల్, వెలుగు: క్రీడలతో విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదో జోనల్ స్థాయి క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. డీసీఓ ప్రశాంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నిరంజన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, భైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.