యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో సంబంధిత అధికారులతో ఆమె యాసంగి వరి కొనుగోలు ప్రక్రియ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, సరిపడా తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలన్నారు.

అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, టెంట్, ధాన్యం మద్దతు ధర తెలిపే బోర్డులు, కంట్రోల్ రూమ్ నంబర్, కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీ ఫోన్ నంబర్లను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, ఇన్​చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, మార్కెటింగ్ ఇన్​చార్జి ఏడీ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.

పంట పొలాలకు నీరివ్వండి

ఖానాపూర్, వెలుగు: సదర్​మాట్ చివరి ఆయకట్టు భూములకు సాగునీరందించాలని రైతులు కలెక్టర్ అభిలాషను కోరారు. రైతు నేత రాజేందర్ హపావత్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. కడెం మండలంలోని మొర్రిగూడం, చిన్న బెల్లాల, పెద్ద బెల్లాల,పెద్దూర్ తండా, చిట్యాల, కొత్త మద్దిపడగ, లక్ష్మి సాగర్ రైతులకు మరో రెండు తడులకు సాగు నీరు అందించాలని కోరారు. పొలాలు పొట్ట దశకు వచ్చాయని, సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.