ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం, రైతు రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు.

దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

టెలిఫోన్ ప్రజావాణి అర్జీల స్వీకరణ

అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల కోసం టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ వివిధ ప్రాంతాల్లోని ప్రజల నుంచి 8 అర్జీలను ఫోన్ ద్వారా స్వీకరించారు. సమస్యలను విని, వాటిని నమోదు చేసుకొని, దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో అర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్​ కాస్ట్​బొగ్గు గనిలో భూములు కోల్పోయిన తమకు వెంటనే ఆర్అండ్ఆర్ ​ప్యాకేజ్, ప్లాట్లను కేటాయించాలని కోరుతూ కాసీపేట మండలం దుబ్బగూడెం భూ నిర్వాసితులు అర్జీ అందజేశారు.

ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్​ను కోరారు. భూ సమస్యలు, నష్టపరిహారం, ఇందిరమ్మ ఇండ్లు, అంత్యోదయ రేషన్ కార్డు, పింఛన్ తదితర సమస్యలపై వచ్చిన ధరఖాస్తులను కలెక్టర్ ​పరిశీలించి సమస్య లను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

వెంటనే పరిష్కరించాలి

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్- టి లోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతూ చనిపోయిన తన కూతురుకు న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని రావులపల్లికి చెందిన సొదారి సమ్మయ్య కలెక్టర్​కు దరఖాస్తు అందజేశారు. బిల్లులు మంజూరు చేయాలని, విద్యుత్, రుణ సౌకర్యం కల్పించాలని అందిన దరఖాస్తులు పరిశీలిస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. 

పెండింగ్ ఉంచొద్దు

ఆదిలాబాద్: ప్రతి సోమవారం గ్రీవెన్స్ కు వచ్చే అర్జీలు పెండింగ్ లో ఉంచకూడదని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్ లో 99 మంది అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అర్జీదారుల సమస్యల పరిష్కారమవుతుందా.. లేదా అనేది వెంటనే తెలియజేయాలని, కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూసుకోవాలన్నారు.

సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.