అర్హులందరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్ అభిలాష అభినవ్ 

ఆసిఫాబాద్/కుంటాల/తిర్యాణి/బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హు లకు అందేలా క్షేత్రస్థాయిలో సర్వే పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై కుంటాల మండలం లింబా కే గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను శనివారం కలెక్టర్ పరిశీలించారు. పథకాల ఎంపికకు సర్వే అధికారులు సేకరిస్తున్న వివరాలు, లబ్ధిదారుల గుర్తింపు విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ఈ నెల 20 వరకు వెరిఫికేషన్ పూర్తి చేసి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించి 26న పథకాల అమలుకు శ్రీకారం చుడతామని తెలిపారు. అంతకుముందు కుంటాల పీహెచ్ సీని తనిఖీ చేశారు. హాస్పిటల్ లో అపరిశుభ్రతపై కలెక్టర్ మండిపడ్డారు. ఏడాది గడిచిపోతున్నా బిల్డింగ్ రిపేర్లు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. సంబంధిత కాంట్రాక్టర్ కు బిల్లు నిలిపివేయాలని ఆదేశించారు. లైబ్రరీ, యోగా సెంటర్ ను పరిశీలించారు. భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, డీఎంహెచ్ వో డాక్టర్ రాజేందర్, డీపీవో శ్రీనివాస్, డీఏవో అంజి ప్రసాద్, డీఎస్ వో కిరణ్ తదితరులున్నారు.

సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్ సమీపంలో నిర్వహిస్తున్న వ్యవసాయ భూముల సర్వేను పరిశీలించారు. వ్యవసాయానికి యోగ్యమయ్యే భూములను మాత్రమే రైతు భరోసా పథకానికి వర్తింపచేయాలని సూచించారు. నాలా, ఇండ్లు, వెంచర్లు, ప్లాట్లుగా మార్చిన భూములను జాబితాలో చేర్చవద్దన్నారు. అనంతరం జన్కాపూర్ లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు.

తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, వ్యవసాయ శాఖ అధికారి మిలింద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు పాల్గొన్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలో జరుగుతున్న సర్వేను అడిషనల్ కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఏవో వినోద్, ఏఈవో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వేమనపల్లి మండలంలోని కేతన్​పల్లి, వేమనపల్లి గ్రామాల్లో చేస్తున్న సర్వేను బెల్లంప్లలి ఆర్డీఓ హరికృష్ణ పరిశీలించారు. పారదర్శకంగా సర్వే చేపట్టాలన్నారు. తహసీల్దార్​రమేశ్, ఏఈవో రుక్సార్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.