- కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ‘డీట్’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ జిల్లా కమిటీ సభ్యులతో శనివారం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్ పై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని, యాప్‌లో నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్హతలతో తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని స్పష్టం చేశారు. నిరక్షరాస్యులు కూడా ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. ఆ సమాచారం ఆధారంగా కంపెనీలు వారిని సంప్రదిస్తాయని తెలిపారు. డీట్ యాప్ నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిలా పనిచేస్తుందన్నారు.
అప్రెంటిస్, ఇంటర్న్‌షిప్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంద న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాకు చెందిన ప్రజలు అనధికారిక ఏజెంట్ల ద్వారా ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళితే వారి వివరాలను కుటుంబసభ్యులు కలెక్టరేట్ వద్ద ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో రేపటి నుంచి 26వ తేదీ లోపు సంప్రదించి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు.
ఇతర వివరాలకు 9866072044 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సీపీవో జీవ రత్నం, మెప్మా పీడీ సుభాష్, జిల్లా కార్మిక అధికారి ముత్యంరెడ్డి, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.