ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ఆరోగ్యంపై మహిళలంతా అవగాహన పెంచుకోవాలని, ఆటలు ఆడాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మహిళా దినోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్​లో వైద్యారోగ్య శాఖ మహిళల కోసం నిర్వహించిన  వైద్య శిబిరాన్ని, కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ నిర్వహించిన క్రీడా పోటీలను కలెక్టర్​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని రాణించాలన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

గుడిహత్నూర్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. ఐటీడీఏ ఆఫీసులో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మహిళలు  ఆన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, దేశ ప్రథమ పౌరురాలితో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఆత్మస్థైర్మమే ఆయుధమన్నారు. ఐటీడీఏ మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేశారు.