నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన జాతీయ పెన్షనర్ల దినోత్సవానికి కలెక్టర్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాధిక, డీటీవో సరోజతో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి కలెక్టర్ మాట్లాడారు. పెన్షనర్ల హక్కులు, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు.
పెన్షనర్లు నాడు చేసిన కృషి, నిబద్ధత, అంకితభావం ఫలితంగానే సమాజం ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులను, విశ్రాంత ఉద్యోగులను కలెక్టర్, అధికారులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కల్యాణి, ఎస్టీవో రమేశ్, తహసీల్దార్ రాజు, సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన పెన్షనర్స్ డే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెమోంటోలు అందించి శాలువాలతో సన్మానించారు. పెన్షనర్లకు ఎలాంటి సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావా లని కలెక్టర్ సూచించారు.