ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం ప్రకారమే భూ బదలాయింపులు చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం ప్రకారమే భూ బదలాయింపులు చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టంపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్​లో వర్క్​షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ భూముల్లో చేపట్టే అభివృద్ధి పనులకు కచ్చితంగా పరివేశ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలన్నారు.

అటవీ భూముల్లో రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ప్రాజెక్టులు, పంచాయతీ భవనాలు తదితర నిర్మాణాల కోసం తప్పనిసరిగా పరివేశ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలన్నారు. జిల్లా స్థాయిలోనే మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా కొనసాగేలా చూడాలని అటవీ అధికారులకు సూచించారు. ప్రతిపాదిత ప్రాజెక్టు టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉంటే కేంద్ర, రాష్ట్ర వైల్డ్ లైఫ్ అధికారుల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడానికి రెవెన్యూ, విద్యుత్, ఇంజనీరింగ్ శాఖలతో అటవీ శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు. పరివేశ్ పోర్టల్ పై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, డీఎఫ్​వో నాగిని బాను, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.