పెండింగ్ సీఎంఆర్ ను వెంటనే చెల్లించండి .. రైస్ మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

పెండింగ్ సీఎంఆర్ ను వెంటనే చెల్లించండి .. రైస్ మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లాలో పెండింగ్‌‌‌‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. సోమవారం భైంసా ఆర్డీవో ఆఫీస్​లో రైస్​మిల్లుల యాజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రాసెసింగ్‌‌‌‌ కోసం గతంలో మిల్లర్లు తీసుకున్న ధాన్యం బకాయిలపై చర్చించారు. పెండింగ్ బకాయిలను త్వరగా చెల్లించాలని, గడువులోపు చెల్లించని మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

మిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి రికార్డు రూం, సిబ్బంది విధులను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం సుధాకర్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

టెండర్ లేకుండా చిరు వ్యాపారాల నుంచి వసూళ్లు

మున్సిపల్ అధికారులు టెండర్ లేకుండానే ప్రతి రోజు చిరు వ్యాపారుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారని కలెక్టర్ అభిలాషకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. భైంసాలో ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్​కు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్ ఆధ్యర్యంలో వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ప్రతిరోజు చిరు వ్యాపారుల నుంచి రూ.5 వేల వరకు ఫీజులు వసూలవుతున్నాయని, నెలకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. 

అయితే ఒకే వర్గానికి చెందిన చిరు వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. మార్చిలోనే టెండర్ ముగిసినా ఇంకా వసూలు చేస్తున్నారని, కొత్త టెండర్​వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని కోరారు. స్పందించిన కలెక్టర్.. మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి టెండర్ వేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.