
నిర్మల్, వెలుగు: సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సదరం కార్డుల జారీ ప్రక్రియపై బుధవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్కోసం ఇప్పుడు మీసేవ కేంద్రాలతో పాటు యూడీఐడీ పోర్టల్, మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
21 రకాల వైకల్యాలకు కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. క్యాంపుల వివరాలను మెసేజ్ల రూపంలో తెలియజేస్తామని చెప్పారు. సదరం కార్డల జారీ ప్రక్రియకు వైద్య బృందానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వైద్యారోగ్య శాఖ అధికారులు గోపాల్, సునీల్, సురేశ్, డీపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు.