- మూడు రోజులు వేడుకలను ఘనంగా నిర్వహించాలి
- అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి
- ఆలయంలో, పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్ల పరిశీలన
- వివిధ శాఖల అధికారులతో సమావేశమై సూచనలు
బాసర, వెలుగు: వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని సౌలతులు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ఆమె బాసరలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గోదావరి పుష్కర ఘాట్ కు వెళ్లి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. నదిలో స్నానం చేసిన భక్తులకు అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని, గజఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని, రాత్రిపూట విద్యు త్ దీపాలను అమర్చాలని తెలిపారు.
అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోగా.. పూజారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. వీఐపీ గెస్ట్ హౌస్ లో వేడుకల నిర్వహణపై అధికారులతో సమావేశమై కలెక్టర్ మాట్లాడారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులు నిర్వహించే వసంత పంచమి వేడుకల పర్యవేక్షణకు భైంసా ఆర్డీఓను స్పెషల్ ఆఫీసర్ గా నియమించినట్లు చెప్పారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలని, శిశువులకు పాలిచ్చేందుకు వీలుగా బేబీ ఫీడింగ్ గదులను ఏర్పరచాలని పేర్కొన్నారు.
గోదావరి పుష్కర ఘాట్, ఆలయ పరిసరాలను సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంచాలన్నారు. 108, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి డాక్టర్లను, సిబ్బందిని, మెడిసిన్ అందుబాటులో ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుంచి భక్తులు ఆలయానికి ఈజీగా చేరుకునేందుకు రూట్ మ్యాప్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు కొనసాగించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, దేవాదాయ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు ఈ సమావేశంలో ఆర్డీవో కోమల్ రెడ్డి, బాసర ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఈఈ అశోక్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ సందీప్, తహసీల్దార్ పవన్ చంద్ర, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.