డీసీఎంఎస్​ సెంటర్లు బంద్​ .. పీఏసీఎస్​, డీఆర్డీఏలకే ధాన్యం కొనుగోలు బాధ్యతలు

డీసీఎంఎస్​ సెంటర్లు బంద్​ .. పీఏసీఎస్​, డీఆర్డీఏలకే  ధాన్యం కొనుగోలు బాధ్యతలు
  • ఎన్​వోసీ జారీ చేయని డీసీవో 
  • కమీషన్ ద్వారా వచ్చే ఆదాయంపై రగడ వల్లే..
  • నిర్మల్​ జిల్లాలో 302  కొనుగోలు కేంద్రాలు 
  • దొడ్డు, సన్న ధాన్యం వేర్వేరుగా సేకరణ

నిర్మల్, వెలుగు: వానాకాలం సీజన్​కు సంబంధించి ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి డీసీఎంఎస్ ను తప్పించారు. ఏటా వానాకాలం, యాసింగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్ తోపాటు పీఏసీఎస్​లకు, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు, జీసీసీలకు కేటాయిస్తూ వస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల ద్వారా కమీషన్ల రూపంలో నిర్వాహకులకు పెద్ద మొత్తం డబ్బులు అందుతున్నాయి.  ఇలా ప్రతి సీజన్ లో ఒక్కో సంస్థకు రూ.5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న డీసీఎంఎస్ కు సైతం ఇంతే వస్తోంది. అయితే, ఈ ఆదాయం తమ జిల్లాలోని రైతులకు, సంస్థలకు కాకుండా డీసీఎంఎస్ కు చెందుతుండటాన్ని పీఏసీఎస్, మహిళా సంఘాల సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఏకంగా జిల్లా సహకార అధికారి(డీసీవో)కి ఫిర్యాదు చేశారు. 

కొనుగోలు కేంద్రాలు కేటాయించలే..

డీసీవో ఎన్ వోసీ జారీ చేయని కారణంగా డీసీఎంఎస్ కు ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించలేదు. ఇదివరకు డీసీఎంఎస్ కు కేటాయించిన సెంటర్లను ఆ సంస్థ కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేది. ప్రభుత్వం క్వింటాల్​ధాన్యం కొనుగోలుకు చెల్లించే రూ.32 కమిషన్ నుంచి రూ.16ను డీసీఎంఎస్, మరో రూ.16ను కొనుగోలు కేంద్రాన్ని కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తులు పంచుకున్నారు. ఏళ్లుగా ధాన్యం సేకరిస్తున్న డీసీఎంఎస్ ను తప్పించడం సరికాదని అంటున్నారు. గత సీజన్ లో డీసీఎంఎస్ కు 95 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించారు.  

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇలా..  

నిర్మల్ జిల్లాలో మొత్తం 302 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో దొడ్డు, సన్న రకాలకు వేర్వేరుగా సేకరించనున్నారు. 180 సెంటర్లలో దొడ్డు రకం, 122 కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు. వీటిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాలకు దొడ్డు రకాల కోసం 88, సన్నరకం ధాన్యం కోసం 65 సెంటర్లు కేటాయించారు. అలాగే, పీఏసీఎస్ లకు దొడ్డు రకం ధాన్యం కోసం 89, సన్న రకం ధాన్యం సేకరణకు 55 కేంద్రాలను కేటాయించారు. జీసీసీ ఆధ్వర్యంలో దొడ్డు రకాలకు సంబంధించిన 3, సన్న రకం ధాన్యానికి సంబంధించి 2 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.   

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని నిర్మల్​ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం కౌట్ల బి, సారంగాపూర్ లతోపాటు స్థానిక మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాలను, ఆలూరు, సోన్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. సెంటర్లలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, తూకం, నాణ్యత విషయాల్లో వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. అనంతరం ఇటీవల దుబాయ్ లో హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని సోన్​గ్రామానికి వెళ్లి, పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్, నాయకులు నరేశ్ రామ్ శంకర్ రెడ్డి, చిన్న రాజేశ్వర్, వీరయ్య, మార గంగారెడ్డి, హరీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.