తండ్రి అంత్యక్రియలు చేసేందుకు చందాలు

తండ్రి అంత్యక్రియలు చేసేందుకు చందాలు
  • ఇద్దరు కూతుళ్ల దయనీయ స్థితి

నర్సాపూర్(జి), వెలుగు: ఐదేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి చనిపోవడంతో దయనీయ స్థితిలో ఉన్న ఇద్దరు కూతుళ్లు తండ్రి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండడంతో గ్రామస్తులంతా కలిసి చందాలు ఇచ్చారు. ఆ డబ్బుతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్​జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన మంగలి చిన్నయ్య-రాజామణి దంపతులు. వారికి ఇద్దరు కూతుర్లు లక్ష్మి, గంగమణి ఉన్నారు. చిన్నయ్య కుల వృత్తి (మంగలి పని) చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇద్దరు కూతుర్లకు పెండ్లిళ్లు చేశాడు.

అయితే ఐదేండ్ల క్రితం భార్య రాజమణి అనారోగ్యంతో చనిపోయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నయ్య(53) సైతం శనివారం ఉదయం చనిపోయాడు. అయితే ఆయన అంత్యక్రియలు చేసేందుకు కూతుర్ల వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తుల సాయం కోరారు. దీంతో గ్రామస్తులంగా చందాలు వేయడంతో రూ.20 వేల దాకా పోగయ్యాయి. ఆ డబ్బులతో సాయంత్రం తండ్రి అంత్యక్రియలు చేశారు.