
- నాడు జిల్లా నుంచి దేవాదాయ మంత్రిగా ఉన్నా ఇంద్రకరణ్ ఫండ్స్ తేలే
- నిరుడు ఆలయ అభివృద్ధికి శంకుస్థాపనలతో సరిపెట్టిన్రు
- సౌకర్యాలు లేక ఎప్పట్లాగే ఇబ్బంది పడుతున్న భక్తులు
నిర్మల్, వెలుగు: బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్లపాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. నాడు నిర్మల్ జిల్లా నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి.. బీఆర్ఎస్ సర్కారులో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫండ్స్ తేలేకపోయారు. చదువులమ్మ గుడిని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని 2018లో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీ మాటలకే పరిమితమైంది. ఎన్నికల ఏడాది కావడంతో నిరుడు శంకుస్థాపన చేసి వదిలేశారు. దీంతో భక్తులు ఎప్పట్లాగే ఇబ్బంది పడుతున్నారు. కొత్త సర్కారైనా ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
కనీస సౌకర్యాలు కూడా లేవు
బాసర ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఇంద్రకరణ్ సీరియస్ గా దృష్టి కేంద్రీకరించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వేల మంది భక్తులు సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా తమ పిల్లల అక్షరాభ్యాసాలను సైతం అమ్మవారి సన్నిధిలోనే నిర్వహిస్తారు. అయితే ఆలయంలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పండుగ వేళల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు తిప్పలు అన్నీఇన్నీ కావు. క్యూలైన్లు, వసతి గృహాలు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర గోస పడుతున్నారు. అలాగే గోదావరి స్నానవాటికల వద్ద కూడా సరైన సౌకర్యాలు లేవు. అక్కడ బట్టలు మార్చుకునేందుకు సౌలతులు లేకపోవడంతో మహిళా భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
దీంతోపాటు అక్షరాభ్యాస కార్యక్రమానికి సంబంధించి కూడా సరైన సౌకర్యాలు ఆలయంలో లేకపోవడం భక్తులను మరింత అసౌకర్యానికి గురిచేస్తోంది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య.. బాసర ఆలయ అభివృద్ధి కోసం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆలయ అభివృద్ధికి చంద్రబాబు.. రూ30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవడం తో ఆ హామీ అమలుకు నోచుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో బాసర ఆలయ అభివృద్ధిపై ఆశలు రెట్టింపు అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ ఆలయంగా పేరున్న బాసరపై అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అందరూ ఆశించారు. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆశించిన రీతిలో చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
యాదాద్రి తరహాలో డెవలప్ చేస్తామని కేసీఆర్ హామీ
బాసర ఆలయ అభివృద్ధి కోసం ఒత్తిడి తీవ్రమవడంతో 2018లో జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్.. యాదాద్రి తరహాలో బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీని కోసం ముందుగా రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. అన్నట్టుగానే బాసర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు 50 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన జీవో నంబర్ 486 జారీ చేశారు. దీంతో కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆలయ పునర్ నిర్మాణ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికకు దేవాదాయ శాఖ సైతం ఆమోదం తెలిపింది. పనుల మంజూరుపై మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించి జీవో సైతం జారీ చేశారు.
అయితే, ఈ జీవో కాగితాలకే పరిమితమైంది. హామీకి అనుగుణంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు చేపట్టలేకపోయారు. బాసర ఆలయ అభివృద్ధి విషయంలో అంతటా విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు నిరుడు మార్చి 24న దేవదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాస్టర్ ప్లాన్ పనులకు భూమిపూజ చేశారు. కానీ భూమిపూజ చేసినా నిధులు విడుదల కాలేదు. భూమిపూజ చేసిన సందర్భంలో వారం రోజుల్లో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని ఇంద్రకరణ్ ప్రకటించినా పైసా కూడా రాలేదు. దీంతో పనులు కూడా మొదలు కాలేదు. దీంతో బాసర సరస్వతీ దేవి ఆలయంలో భక్తులను అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి.
కొత్త సర్కారు పైనే ఆశలు..
ఆలయాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పుకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. బాసర సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో బాసర ఆలయ అభివృద్ధి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి సైతం బాసర సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధి విషయంలో కేసీఆర్ సర్కారు పై విమర్శలు చేశారు. ఇప్పడు ఆయనే సీఎం కావడంతో బాసర ఆలయ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని భక్తులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు సంబంధించి నిధులు విడుదల చేయాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.