మంత్రి తలసానిపై కేసు నమోదు చేయాలి

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు

నెట్​వర్క్, వెలుగు : నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాడి చేయడాన్ని ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తలసానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నిర్మల్ జిల్లా లంబాడి జేఏసీ చైర్మన్ జాదవ్ వెంకట్ రావ్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మంత్రిని అరెస్ట్​చేయాలంటూ కుభీరు గిరిజన నాయకులు ఎస్సై ఎండీ షరీఫ్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ గిరిజన నాయకుడిపై మంత్రి అనుచిత ప్రవర్తన రాష్ట్ర గిరిజన, ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మంత్రి పదవి నుంచి తలసానిని వెంటనే భర్తరఫ్ చేయాలని గిరిజన లంబాడ జేఏసీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాయక్ రాథోడ్ డిమాండ్​చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.