
నిర్మల్, వెలుగు: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖం భూముల ఆక్రమణలను గుర్తించడం జరిగిందని, బాధ్యులకు నోటీసులు జారీ చేయడంతోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకల్యాణి, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టాలి...
మరోవైపు, జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పశువుల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అంతర్రాష్ట్ర, జిల్లా చెక్ పోస్టుల వద్ద పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధి కారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల రవాణా పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. డ్రగ్స్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.